హీరో శర్వానంద్, డైరెక్టర్ కిశోర్ తిరుమల ఫస్ట్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. తొలిసారి శర్వానంద్ సరసన నాయికగా నటిస్తోంది రశ్మికా మందణ్ణ. అంతేకాదు… కిశోర్ తిరుమల డైరెక్షన్ లో ఆమె నటించడం కూడా ఇదే మొదటిసారి. మంగళవారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది. పలు తెలుగుతో పాటు హిందీ చిత్రాల్లోనూ నటిస్తున్న రశ్మిక… మొదటిరోజు శర్వానంద్ తో కలిసి షూటింగ్ లో పాల్గొనడం విశేషం.
అలానే శర్వానంద్ కూడా ఇప్పుడు ‘మహా సముద్రం’తో పాటు తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘ఒకే ఒక జీవితం’లో నటిస్తున్నాడు. ఇప్పుడు సెట్స్ పై ఉన్న మూడో చిత్రంగా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ నిలుస్తుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ సారంగ్ సినిమాటోగ్రాఫర్. మంగళవారం హీరోహీరోయిన్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు దర్శకుడు కిశోర్ తిరుమల. దీనికి సంబంధించిన ఓ వర్కింగ్ స్టిల్ ను ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ బిగెన్స్’ అంటూ హీరో శర్వానంద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జాతీయ అవార్డు గ్రహీత ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికి కూర్పరి.