దివంగత బాలీవుడ్ కొరియోగ్రఫర్ సరోజ్ ఖాన్ బయోపిక్ ప్రస్తుతం చర్చగా మారింది. మొదట్లో డ్యాన్స్ మాస్టర్ రెమో డిసౌజా సరోజ్ బయోపిక్ కోసం ముందుకొచ్చినప్పటికీ ఇప్పుడు ఆయన అఫీషియల్ గా డ్రాప్ అయ్యాడు. తాను సరోజ్ ఖాన్ జీవితకథ సినిమాగా తీయబోవటం లేదని తేల్చి చెప్పాడు. టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాతగా బరిలోకి దిగటం తనకు ముందే తెలుసునని రెమో చెప్పాడు.
ఒకవైపు డైరెక్టర్ గురించిన చర్చ జరుగుతుండగానే మాధురీ దీక్షిత్ పేరు కూడా న్యూస్ లోకి వచ్చింది. రెమో కాకపోతే సరోజ్ ఖాన్ మూవీని డైరెక్ట్ చేసేది ఎవరో ఇంకా నిర్మాతలు స్పష్టం చేయలేదు. కానీ, అప్పుడే సరోజ్ బయోపిక్ మాధురీ నరేట్ చేస్తే బావుంటుందని టాక్ వినిపిస్తోంది. స్వయంగా సరోజ్ ఖాన్ కూతురు సఖైనా ఖానే తన మనసులో మాట చెప్పటంతో ఇప్పుడు చాలా మంది మాధురీ కూడా ప్రాజెక్ట్ లో భాగం కావాలని కోరుకుంటున్నారు.
డ్యాన్స్ మాస్టర్ గా సరోజ్ ఖాన్, ఆమె డిజైన్ చేసిన ఐకానిక్ డ్యాన్స్ మూవ్మెంట్స్ ని తెరపై ప్రదర్శించే ‘ధక్ ధక్’ గాళ్ గా మాధురీ… బాలీవుడ్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ జోడీ. అందుకే, సరోజ్ తో మాధురీకి ఉన్న అనుబంధం కారణంగా ఆమె బయోపిక్ ని నరేట్ చేస్తే బావుంటుందని సఖైనా అభిప్రాయపడింది. అదే విషయాన్ని నిర్మాత భూషణ్ కుమార్ కి చెప్పిందట కూడా. అయితే, టీ-సిరీస్ అధినేత మాధురీతో ఇంకా చర్చలు జరపాల్సి ఉంది.
సరోజ్ ఖాన్ బయోపిక్ అన్నప్పటి నుంచీ వెండి తెరపై ఆమెలా ఎవరు కనిపిస్తారని కూడా జనం మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఎవరి పేరు కూడా గట్టిగా వినిపించటం లేదు. కానీ, సరోజ్ ఖాన్ కొరియోగ్రాఫ్ చేసిన చాలా పాటలకి శ్రీదేవి తెర మీద లెజెండ్రీ స్టేటస్ తీసుకొచ్చింది. అందుకే, ఆమె పాత్రని ఎవరు చేస్తారని కూడా బాలీవుడ్ లో ఊహాగానాలు నడుస్తున్నాయి. సరోజ్ కూతురు సుఖైనా ఖాన్ మాత్రం శ్రీదేవిగా జాన్వీ కపూర్ ది బెస్ట్ అంటోంది! చూడాలి మరి, ముందు ముందు సరోజ్ ఖాన్ బయోపిక్ క్యాస్టింగ్ విశేషాలు, ఇంకెన్ని, మనల్ని ఆశ్చర్యపరుస్తాయో!