రాజ్ కుంద్రా వ్యవహారం ఆయనకంటే ఎక్కువగా శిల్పా శెట్టికి అవమానాలు, చిక్కులు తెచ్చి పెట్టింది. భర్త అరెస్ట్ తో మానసికంగా కృంగిపోయిన మిసెస్ కుంద్రా మీడియా వ్యవహార శైలితో మరింత ఇబ్బంది పడింది. ఆమె ఇల్లు దాటి బయటకు రాలేని స్థితి ఏర్పడింది. అయితే, కోర్టును ఆశ్రయించి పరువు నష్టం దావా వేసిన శిల్పకి అక్కడా చుక్కెదురైంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటూ న్యాయస్థానం మీడియా సంస్థలపై యాక్షన్ కి నో చెప్పింది. అయితే, ఈ మొత్తం గందరగోళంలో ‘సూపర్ డ్యాన్సర్ 4’ వార్తలు కూడా తెగ చక్కర్లు కొడుతున్నాయి…
గీతా కపూర్, అనురాగ్ బసుతో కలసి శిల్పా శెట్టి ‘సూపర్ డ్యాన్సర్ 4’ జడ్జ్ గా వ్యవహరిస్తోంది. అంతే కాదు, ఆమె గత మూడు సీజన్స్ లో కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది. అసలు సూపర్ డ్యాన్సర్ అంటేనే ఎవరికైనా అమాంతం శిల్పా గుర్తుకు వస్తుంది. అంతలా ఆమె సదరు డ్యాన్సింగ్ రియాల్టీ షోతో పెనవేసుకుపోయింది. కానీ, ఇప్పుడు రాజ్ కుంద్రా వివాదంతో శిల్పా తెరమరుగు అయింది. ప్రస్తుతం విదేశాల్లో ఉందని టాక్. ఆమె తిరిగి వచ్చి షోలో చేరటానికి టైం పడుతుందట. మరి అప్పటి దాకా షో పరిస్థితి ఏంటి? ఇప్పటికైతే వారానికి ఒక బాలీవుడ్ సెలబ్రిటీని పిలిచి కూర్చోబెడుతున్నారు. కానీ, శిల్పా స్థానంలో ఎక్కువ రోజులు మరో జడ్జ్ ఒక్కరే ఉంటే బావుంటుందని షో నిర్వాహకుల ఆలోచనట. అందుకే, వారు 90స్ లో శిల్పా లాగే బాక్సాఫీస్ ని ఏలిన మరో హాట్ బ్యూటీ రవీనాని అప్రోచ్ అయ్యారట!
‘సూపర్ డ్యాన్సర్ 4’లోకి శిల్పా బదులు తనని రమ్మంటే ‘నో’ చెప్పిందట రవీనా టాండన్. ‘సూపర్ డ్యాన్సర్’ షోని ఆమె ఓన్ చేసుకున్నట్టుగా మరొకరు చేసుకోలేరని అభిప్రాయపడిందట. తన స్థానం నేను భర్తీ చేయలేనని రవీనా అందట! నిజమే మరి… నాలుగు సీజన్స్ లో నిరంతరంగా అలరించిన శిల్పాని మరిచిపించటం అంత ఈజీ కాదు కూడా! కాబట్టి రవీనా గుడ్ డిజీషన్ తీసుకుందనే చెప్పాలి…