క్వెంటిన్ టారంటినో… హాలీవుడ్ చిత్రాలు రెగ్యులర్ గా చూసే వారికి ఈయనెవరో తెలిసే ఉంటుంది. ‘పల్ప్ ఫిక్షన్, కిల్ బిల్, ఇన్ గ్లోరియస్ బాస్టర్డ్స్’ లాంటి సూపర్ హిట్స్ ఆయనవే! టారంటినో చిత్రాలు కథ, కథనం విషయంలోనే కాదు టైటిల్స్ కు సంబంధించి కూడా సరికొత్తగా ఉంటూ ఉంటాయి. అందుకే, ఆయన్ని ఇష్టపడే ప్రేక్షకులు అతడి నెక్ట్స్ మూవీ టైటిల్ ఏంటా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక ఈ ఆస్కార్ నామినేటెడ్ డైరెక్టర్ బాక్సాఫీస్ పైకి సంధించిన ఏ సినిమా చూడటం మొదలు పెట్టినా అమాంతం మనం అభిమానించటం మొదులు పెట్టేస్తాం. అంతటి మెస్మరైజింగ్ షో మ్యాన్ టారంటినో!
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించిన క్వెంటిన్ టారంటినో కొన్నాళ్ల క్రితం పెద్ద షాకిచ్చాడు. తన రిటైర్మెంట్ గురించి మాట్లాడి ఆశ్చర్యపరిచాడు. ఇప్పటి వరకూ తొమ్మిది చిత్రాలు డైరెక్ట్ చేసిన ఆయన పదో సినిమా తరువాత దర్శకత్వానికి గుడ్ బై చెబుతానని తాజాగా మళ్లీ ప్రకటించాడు. ఫ్యాన్స్ ని డిజపాయింట్ చేసేలా తన నిర్ణయంలో మార్పు లేదని కుండ బద్ధలు కొట్టాడు!
‘’హాలీవుడ్ డైరెక్టర్ గా నీ కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. వయస్సు కూడా మించిపోలేదు. రిటైర్మెంట్ ఎందుకు?’’ అంటోన్న వారికి, టారంటినో, ‘’పీక్స్ లో ఉన్నప్పుడే కదా రిటైర్ అవ్వాలి!’’ అంటూ సమాధానం ఇస్తున్నాడు. 30 ఏళ్లుగా ఫిల్మ్ మేకింగ్ కి తాను తన సర్వస్వం ఇచ్చేశాననీ… ఇక మీద పెద్దగా ఇచ్చేదేమీ ఉండదని చెబుతున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్. అందుకే, మరో సినిమా మాత్రం తీసి అస్త్ర సన్యాసం చేస్తానని రెండో ఆలోచన లేకుండా ప్రకటించేశాడు!
టారంటినో తొమ్మిదో చిత్రం ‘వన్స్ అప్ ఆన్ ఏ టైం ఇన్ హాలీవుడ్’. దానికి కొనసాగింపుగా అదే పేరుతో నవలని కూడా రచించాడు. ‘వన్స్ అప్ ఆన్ ఏ టైం ఇన్ హాలీవుడ్’ నావల్ ప్రమోషన్ లో భాగంగా తన రిటైర్మెంట్ పై మరోమారు స్పందించాడు. చూడాలి మరి, తన కెరీర్ లో చివరి చిత్రం అంటోన్న టెన్త్ మూవీని టారంటినో ఎలా తీస్తాడో!