‘’ఎప్పుడో 30 ఏళ్ల కిందట మేం చేసిన చిత్రాలు చూసి ఆశ్చర్యపోవటం కాదు… ఇప్పుడు ఇక ఈ తరం ఫిల్మ్ మేకర్స్ తమవైన అద్భుత చిత్రాలు రూపొందించాలి!’’ అంటున్నాడు కమల్ హాసన్. ‘ప్రేమమ్’ సినిమా దర్శకుడు అల్ఫోన్స్ పుత్రేన్ ఆ మధ్య కమల్ హాసన్ ‘దశావతారం’ ట్వీట్ కు స్పందించాడు. 13 ఏళ్లు పూర్తయ్యాయంటూ కమల్ ‘దశావతారం’ సినిమాని గుర్తు చేసుకోగా… డైరెక్టర్ అల్ఫోన్స్ ఆ సినిమాని ‘పీహెచ్ డీ’తో పోల్చాడు. అయితే, ‘దశావతారం’ పీహెచ్డీ కాగా ‘మైకెల్ మదన కామరాజు’ చిత్రం డిగ్రీ లాంటిదన్నాడు. ఆ సినిమా అప్పట్లో ఎలా రూపొందించారో వివరించమంటూ రిక్వెస్ట్ చేశాడు. అల్ఫోన్స్ అభ్యర్థనని కమల్ యాక్సెప్ట్ చేశాడు కూడా!
కమల్ హాసన్ ‘మైకెల్ మదన కామరాజు’ మూవీ మేకింగ్ లోని రహస్యాల్ని, అనాటి అనుభవాల్ని ట్విట్టర్లో నెటిజన్స్ తో షేర్ చేసుకున్నాడు. కీలకమైన సన్నివేశాలు ఎలా చిత్రీకరించారో చెప్పాడు. అయితే, అల్ఫోన్స్ లాంటి ఈ తరం దర్శకులకి ఓ కీలకమైన సందేశం కూడా ఇచ్చాడు. ‘మైకెల్ మదన కామరాజు’ లాంటి చిత్రాలు ఇప్పటికీ చూస్తూ సంభ్రమాశ్చర్యాలకు లోనుకావటం కాకుండా… న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ న్యూ క్లాసిక్స్ రూపొందించాలని పిలుపునిచ్చాడు. అంతే కాదు… కమల్ తాను బోధించటానికి ఇష్టపడనని చెప్పాడు. విద్యార్థిగా నేర్చుకోటానికే ప్రయత్నిస్తానని అన్నాడు. సింగీతం శ్రీనివాసరావు, బాలచందర్, అనంతు లాంటి దిగ్గజ దర్శకుల్నుంచీ తాను ఎంతో నేర్చుకున్నానని అన్న ఆయన… బోధన ఎంతో పవిత్రమైన, గొప్ప పని అన్నాడు.
కమల్ చెప్పినట్టు మన యంగ్ డైరెక్టర్స్ గొప్ప చిత్రాలు రూపొందించటంలో తలమునకలు కావాల్సిందే. ప్రపంచ సినిమా వేదికపై ఇప్పటికీ మనం చాటాల్సినంత సత్తా చాటలేదనే భావించాలి.