పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీని ఫిబ్రవరి 25వ తేదీ లేదా ఏప్రిల్ 1న విడుదల చేస్తామని ఆ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిన్న తెలిపింది. సరిగ్గా ఇప్పుడు అదే బాటలో వరుణ్ తేజ్ ‘గని’ సినిమా నిర్మాతలూ నడువ బోతున్నారు. నిజానికి ఈ సినిమాను మార్చి 18న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించిన నిర్మాతలు ఇప్పుడు పలు చిత్రాల విడుదల తేదీలలో జరిగిన మార్పులను దృష్టిలో పెట్టుకుని రెండు తేదీలను అనౌన్స్ చేశారు. అన్నీ అనుకూలిస్తే ఫిబ్రవరి 25న (అంటే వారి ఉద్దేశ్యంలో ‘భీమ్లా నాయక్’ రాకపోతే కావచ్చు), లేదంటే మార్చి 4వ తేదీన ‘గని’ చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. మొత్తంగా చూసుకుంటే… ‘గని’ సినిమాను మూడు లేదా రెండు వారాల ముందు విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధు ముద్ద, అల్లు బాబీ తెలిపారు. వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు.