ప్రముఖ నిర్మాత దిల్
రాజు బ్యానర్ లో ఒకసారి పనిచేసిన దర్శకులు కానీ హీరోలు గానీ మళ్ళీ మళ్ళీ ఆ బ్యానర్ లో పనిచేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అలా వాళ్ళను తనవైపుకు తిప్పుకుంటారు దిల్
రాజు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడికి, దిల్
రాజుకు ఉన్న అనుబంధం కూడా గట్టిదే. వరుసగా అదే బ్యానర్ లో సినిమాలు చేస్తున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3
మూవీ చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే మహేశ్ బాబుతో మూవీ చేయాలన్నది అనిల్ రావిపూడి కోరిక. అందుకోసం మహేశ్ కు ఓ కథ కూడా అనిల్ వినిపించి, ఓకే చేయించుకున్నాడని తెలిసింది. అయితే… మహేశ్ డేట్స్ మాత్రం ఇప్పట్లో అనిల్ రావిపూడికి దక్కేలా లేవు. ఎందుకంటే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సర్కారు వారి పాట
ను పూర్తి చేయగానే, త్రివిక్రమ్ మూవీ చేయాలి. ఆ తర్వాత రాజమౌళితో మహేశ్ సినిమా చేస్తాడని గట్టిగా వినిపిస్తోంది. దాంతో వచ్చే యేడాది సమ్మర్ తర్వాత గానీ మహేశ్ డేట్స్ వేరెవరికీ దొరకవని అంటున్నారు. ఇదిలా ఉంటే… ఎఫ్ 3
తర్వాత బాలకృష్ణతో అనిల్ రావిపూడి ఓ సినిమాకు కమిట్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. అది పూర్తయ్యే సరికి కూడా వచ్చే యేడాది వేసవి అవుతుంది.
ఇక తొలిసారి పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్
మూవీని ప్రొడ్యూస్ చేసిన దిల్
రాజు మరోసారి ఆయనతో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు
తో పాటు, అయ్యప్పనుమ్ కోషియుమ్
రీమేక్ లో నటిస్తున్నాడు. దాని తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో మూవీ చేయాల్సి ఉంది. వీటి తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా నిర్మించాలన్నది దిల్
రాజు ఆలోచనట. ఆ రకంగా మహేశ్ బాబు ప్రాజెక్ట్ నుండి అనిల్ రావిపూడిని పవన్ కళ్యాణ్ వైపు దిల్
రాజు టర్న్ చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి కరోనా పరిస్థితులు ఎప్పటికి సర్ధుకుంటాయో… ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఎప్పటికి పూర్తవుతాయో చూడాలి!