నటశిక్షకుడు… దేవదాస్ కనకాల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటునిగా అలరించాలని పూనా ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో నటనలో శిక్షణ తీసుకున్న దేవదాస్ కనకాల, తరువాతి రోజుల్లో ఎందరో నటులను తయారు చేసిన నటశిక్షకునిగా నిలిచారు. ఆయన సతీమణి లక్ష్మి సైతం పలువురు స్టార్స్ కు నటనలో శిక్షణ ఇచ్చినవారే. ఈ దంపతుల వద్ద శిక్షణ తీసుకున్న వారెందరో నేడు చిత్రసీమలో రాణిస్తున్నారు. వారి తనయుడు రాజీవ్ కనకాల ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా అలరిస్తున్నారు. ఇక కోడలు సుమ స్టార్ యాంకర్ గా జైత్రయాత్ర సాగిస్తున్నారు. త్వరలోనే రాజీవ్ తనయుడు కూడా హీరోగా వచ్చే ప్రయత్నం సాగుతోంది.
యానాంలో జన్మించిన దేవదాస్ కనకాలకు చిన్నతనం నుంచీ నాటకాలంటే పిచ్చి. ముఖ్యంగా ‘కన్యాశుల్కం’ నాటకమంటే ఎంతో అభిమానం. దానిని ఎవరు ఎక్కడ ప్రదర్శిస్తున్నా వెళ్ళి చూసేవారు. నటీనటులు ఇలా చేసి ఉంటే బాగుండేదే, అలా నటించి ఉంటే ఆకట్టుకొనేవారే అంటూ విశ్లేషించేవారు. ఆ రోజుల్లో ఆయనకు ఆదుర్తి సుబ్బారావు అభిమాన దర్శకుడు. ఆయన రూపొందించిన చిత్రాల కథల్లోని వైవిధ్యం, పాటల చిత్రీకరణ దేవదాస్ కు ఎంతగానో నచ్చేవి. ఓ సారి అతి ప్రయాసమీద ఆదుర్తిని కలుసుకున్నారు. ఆయన సలహా మేరకు నటనలో శిక్షణ పొందాలని నిర్ణయించి, పూనా ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో చేరి నటునిగా శిక్షణ పొందారు. అక్కడ నుండి రాగానే మళ్ళీ ఆదుర్తిని కలిశారు. అప్పుడు ఆదుర్తికి దేవదాస్ లోని పట్టుదల ఎంతగానో నచ్చింది. ఏయన్నార్, ఆదుర్తి కలసి ‘చక్రవర్తి చిత్ర’ అనే సంస్థను నెలకొల్పి, అభ్యుదయ భావాలతో చిత్రాలు నిర్మించారు. వారు నిర్మించిన ‘సుడిగుండాలు, మరో ప్రపంచం’లో దేవదాస్ కు చిన్న వేషాలు దక్కాయి. తరువాత ఏయన్నార్ తో బాపు తెరకెక్కించిన ‘బుద్ధిమంతుడు’లో దేవదాస్ హీరోకు స్నేహితునిగా నటించారు. దేవదాస్ లోని ఈజ్ ను కె.విశ్వనాథ్ పసిగట్టారు. ఆదుర్తి వద్ద కొన్ని చిత్రాలకు అసోసియేట్ గా పనిచేసి, తరువాత డైరెక్టర్ అయ్యారు కె.విశ్వనాథ్. అందువల్ల తమ గురువు రూపొందించే చిత్రాలను విశ్వనాథ్ పరిశీలిస్తూ ఉండేవారు. ఈ క్రమంలో విశ్వనాథ్ దృష్టిని దేవదాస్ ఆకర్షించారు. తాను తెరకెక్కించిన ‘ఓ సీత కథ’లో దేవదాస్ కు కీలక పాత్రను ఇచ్చారు విశ్వనాథ్. ఆ సినిమాతో దేవదాస్ నటనకు మంచి గుర్తింపు లభించింది. తరువాత విశ్వనాథ్ ‘ప్రేమబంధం, సిరిసిరిమువ్వ’ వంటి చిత్రాలలో దేవదాస్ నటించారు. ఆపై అనేక చిత్రాలలో దేవదాస్ గుర్తింపు ఉన్న పాత్రలే పోషించారు.
Also Read
పూనా ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో విద్య నేర్వడం వల్ల దేవదాసు మనసు డైరెక్షన్ వైపుకూ మళ్ళింది. ‘చలిచీమలు’తో దర్శకునిగా మారారు. తరువాత ‘నాగమల్లి’ సినిమానూ రూపొందించారు. ‘చలిచీమలు’తోనే పరుచూరి సోదరుల్లో పెద్దవారయిన వెంకటేశ్వరరావు చిత్రసీమలో ప్రవేశించారు. ఇక ‘నాగమల్లి’కి దేవదాస్ వద్ద ఇ.వి.వి. సత్యనారాయణ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. నాటకాలను పరిశీలించడమూ, అందులో ప్రతిభ కనబరచిన నటీనటులకు, రచయితలకూ అవకాశాలు కల్పిస్తూ సాగారు దేవదాస్. ఆయన దర్శకత్వంలో “నిజం, ఓ ఇంటి బాగోతం, పుణ్యభూమి కళ్ళు తెరిచింది” వంటి చిత్రాలు రూపొందాయి. అదే సమయంలో దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి నెలకొల్పిన నటశిక్షణాలయంలో దేవదాస్ పనిచేశారు. అక్కడే ఆయన భార్య లక్ష్మి కూడా శిక్షణ ఇస్తూ ఉండేవారు. లక్ష్మి శిక్షణలో స్టార్స్ అనిపించుకున్నవారిలో రజనీకాంత్ ప్రముఖులు. ఇక వారిద్దరి వద్ద శిక్షణ అభ్యసించిన వారిలో చిరంజీవి, సుధాకర్, రాజేంద్రప్రసాద్, హరిప్రసాద్, భానుచందర్ వంటివారు ఉన్నారు. మద్రాసులో ఉండగా మరికొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు దేవదాస్. తరువాత ప్రముఖ దర్శకుడు వి.మధుసూదనరావు హైదరాబాద్ లో ‘మధు ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్’ ఆరంభించినప్పుడు దేవదాస్ కనకాలను ప్రిన్సిపల్ గా ఆహ్వానించారు. ‘మధు ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్’కు కొన్నేళ్ళు ప్రిన్సిపల్ గా పనిచేశారు దేవదాస్. ఆయన వద్ద నటశిక్షణ పొందిన వారిలో శ్రీకాంత్, శివాజీరాజా, శివసత్యనారాయణ వంటి వారు ఉన్నారు. ఓ వైపు నటశిక్షణ ఇస్తూనే, మరోవైపు తన దరికి చేరిన పాత్రల్లో నటించారు దేవదాస్. తరువాత దేవదాస్ దంపతులు సొంతగా మరో నటశిక్షణాలయం నెలకొల్పారు. అక్కడ అనేక మంది శిక్షణ పొంది ప్రస్తుతం చిత్రసీమలోనూ, బుల్లితెరపైనా, నటీనటులుగా, యాంకర్స్ గా రాణిస్తున్నారు. దేవదాస్, లక్ష్మి దంపతుల తనయుడు రాజీవ్ కనకాల కొన్ని చిత్రాలలో హీరోగా నటించినా, ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా సాగుతున్నారు. త్వరలోనే రాజీవ్ ,సుమ దంపతుల తనయుడు కూడా హీరోగా పరిచయం కానున్నాడని తెలుస్తోంది.
ఎంతోమంది నటీనటులకు శిక్షణ ఇచ్చిన దేవదాస్ దంపతుల్లో లక్ష్మి ముందుగా కన్నుమూశారు. ఆమె కాలం చేసిన యేడాదికే దేవదాస్ కూడా తుదిశ్వాస విడిచారు. వారి స్ఫూర్తితో ఇప్పటికీ ఎన్నో నటశిక్షణాలయాలు వెలుస్తూనే ఉన్నాయి. నటులకు శిక్షణ అన్న మాట వినిపించిన ప్రతీసారి తెలుగునేలపై ఈ దంపతుల పేర్లు కూడా వినవస్తుంటాయి.
తాజావార్తలు
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!