2021 ప్రారంభంలో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టటంతో మార్చ్ నెలకల్లా అనేక సినిమాల రిలీజ్ డేట్లు అనౌన్స్ అయ్యాయి. కానీ, ఏప్రెల్ నుంచీ సీన్ మారిపోయింది. సెకండ్ వేవ్ ఉధృతంగా వచ్చి పడటంతో మరోసారి బాక్సాఫీస్ మూతపడిపోయింది. థియేటర్ల గేట్లు తెరుచుకోవటం లేదు. మరి నిర్మాతల పరిస్థితి ఏంటి? 2020లో చేసిందే ఇప్పుడూ చేస్తున్నారు. ఓటీటీ వైపు సీరియస్ గా లుక్కేస్తున్నారు.
లాస్ట్ ఇయర్ చాలా సినిమాలు, ముఖ్యంగా, బాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీస్ ఆన్ లైన్ స్ట్రీమింగ్ ని ఎంచుకున్నాయి. ఆలస్యం అమృతం విషం అనుకుంటూ జనం ముందుకు ఏదో ఒక విధంగా వచ్చేశాయి. ఇప్పుడూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లాంటి సంస్థలు బాలీవుడ్ కు పెద్ద ఆశా కిరణంగా మారాయి. థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేసిన మూవీస్ ఒక్కొక్కటిగా ఓటీటీ బాట పడుతున్నాయి… డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వబోతోన్న తాజా చిత్రం ‘హంగామా 2’. దీనికి దర్శకుడు ప్రియదర్శన్ కాగా సీనియర్ యాక్టర్స్ పారేశ్ రావల్, శిల్ప శెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. యంగ్ హీరో మీజాన్ జాఫ్రీకి ఫీమేల్ లీడ్ గా మన సౌత్ బ్యూటీ ప్రణీత కనిపించబోతోంది. 2003లో విడుదలైన హిట్ మూవీ ‘హంగామా’కి ‘హంగామా 2’ సీక్వెల్ అంటున్నారు. అయితే, ఈ సినిమా ఇప్పుడప్పుడే థియేటర్లకు వచ్చే అవకాశాలు లేకపోవటంతో నిర్మాతలు డిస్నీ హాట్ స్టార్ తో చర్చలు జరుపుతున్నారట. త్వరలోనే డిజిటల్ రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది. ‘హంగామా 2’ కంటే ముందుగానే సైఫ్ అలీఖాన్ స్టారర్ ‘భూత్ పోలీస్’ ఓటీటీ బాట పట్టింది. రీసెంట్ గా ఫిల్మ్ మేకర్స్ హాట్ స్టార్ లో తమ సినిమా విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు. చూడాలి మరి, ‘భూత్ పోలీస్, హంగామా 2’ రూటులో ఇంకెన్ని బీ-టౌన్ మూవీస్ ఆన్ లైన్ బాట పడతాయో…