టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, పిఆర్వో బిఏ రాజు గుండెపోటుతో నిన్న రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలు చూసే పి ఆర్ ఓ గా సినీ జీవితాన్ని ప్రారంభించిన బి. ఏ. రాజు ఆ తరువాత ఆయన ప్రోద్బలంతోనే ఫిల్మ్ జర్నలిస్ట్ గా మారారు. ఆంధ్రజ్యోతి, జ్యోతి చిత్ర, ఉదయం, శివరంజని వంటి దినవార పత్రికలలో సినీ పాత్రికేయుడుగా వివిధ హోదాలలో పని చేశారు. ఆయన భార్య దర్శకత్వం వహించిన ప్రేమలో పావని కళ్యాణి, చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం చిత్రాలను నిర్మించారు. తన నాలుగు దశాబ్దాల పాత్రికేయ ప్రస్థానంలో చిత్ర పరిశ్రమ మొత్తం అత్యంత ఆప్తుడిగా భావించే స్థాయికి బిఏ రాజు ఎదిగారు. బి.ఏ.రాజు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. టాలీవుడ్ లో సుమారు 1500 పైగా సినిమాలకు బిఏరాజు పిఆర్ఓ గా వ్యవహరించారు. బిఏ రాజు ఆకస్మిక మృతి సినీ వర్గాలను విషాదంలో ముంచింది. అయితే ఈరోజు బిఏ రాజు కన్నుమూయడంతో ఆయనకు గౌరవ నివాళులు అర్పిస్తూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పీఆర్వోలు ఈరోజును బ్లాక్ డేగా ప్రకటించారు. ఈ రోజు (మే 22)న సినిమాలకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ ను పోస్ట్ చేయకూడదని నిర్ణయించుకున్నారు.