‘చిన్నారి పెళ్లికూతురు’గా తెలుగు వారికి పరిచయం అయిన అవికా గోర్ ఏ క్షణంలోనైనా అందాల పెళ్లికూతుర్ని అయిపోటానికి సిద్ధం అంటోంది. కారణం ఆమెకు మన హైద్రాబాద్ లో దొరికిన ప్రియ మన్మథుడే! అఫ్ కోర్స్, అవికా బాయ్ ఫ్రెండ్ మిలింద్ చంద్వానీ హైద్రాబాదీ ఏం కాదు. కానీ, వారిద్దరూ ఇక్కడే కలుసుకున్నారట! మిలింద్ ని చూసిన తొలి క్షణం నుంచే అవికా ఇష్టం పెంచుకుందట. తరువాతి కాలంలో ముందుగా తానే ప్రేమ సంగతి ప్రియుడితో చెప్పిందట కూడా! ‘రోడీస్’ షో ద్వారా ఫేమస్ అయిన మిలింద్ చంద్వానీ కూడా అవికాతో రిలేషన్ షిప్ కి ఓకే అన్నాడట.
అవికా కొన్నాళ్ల క్రితమే తాను ప్రేమలో పడ్డట్టు రివీల్ చేసింది. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లెప్పుడనే మ్యాటర్ పై కూడా క్లారిటీ ఇచ్చింది. తన వయస్సు ఇంకా తక్కువే కాబట్టి పెళ్లి పీటలు ఎక్కటానికి తొందరేం లేదంటోంది చిన్నారి పెళ్లికూతురు! కానీ, మనసు దోచిన మిలింద్ బాబు ఎప్పుడంటే అప్పుడు ఏడు అడుగులు వేయటానికి రెడీ అని కూడా అంటోంది. పెళ్లి సంగతి బాయ్ ఫ్రెండ్ ఇష్టానికే వదిలేసింది.
సోషల్ మీడియాలోనూ తన పట్టలేని ఆనందాన్ని ఫాలోయర్స్ తో షేర్ చేసిన ‘ఉయ్యాల జంపాల’ బ్యూటీ తనకంతా ఓ కలలా ఉందంటోంది! మనసుకు నచ్చిన, అర్థం చేసుకునే, ప్రేరణనిచ్చే భాగస్వామి దొరకటం అదృష్టం అంటూ పొంగిపోతోంది! చూడాలి మరి, ఈ బుల్లితెర పెళ్లికూతురు నిజ జీవితంలో నవ వధువుగా ఎప్పుడు దర్శనం ఇస్తుందో…