(జూన్ 25న సాయిచంద్ పుట్టినరోజు)
నటుడు సాయిచంద్ ప్రస్తుతం కేరెక్టర్ రోల్స్ లో అలరిస్తున్నారు. ఒకప్పుడు హీరో కావాలనే చిత్రసీమలో అడుగుపెట్టారు. ఆరంభంలో ‘మాభూమి’ వంటి సంచలనాత్మక చిత్రంలో ప్రధాన భూమిక పోషించి మెప్పించారు. ఆ తరువాత ‘మంచు పల్లకి’లో చిరంజీవి స్నేహితునిగా, ‘ఈ చరిత్ర ఏ సిరాతో’, ‘ఈ దేశంలో ఒక రోజు’ వంటి చిత్రాలలో గుర్తింపు ఉన్న పాత్రలూ పోషించారు. బాపు ‘పెళ్ళీడు పిల్లలు’లో ఓ హీరోగా నటించారు. ‘ఈ చదువులు మాకొద్దు’లోనూ కీలక పాత్ర ధరించారు. ఎందుకనో సాయిచంద్ పరుగెత్తి పాలుతాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు అనుకున్నట్టున్నారు. తన దరికి చేరిన పాత్రలనే ఎంచుకున్నారు కానీ, ఏ రోజునా పాత్రల కోసం పాదరక్షలు అరిగేలా తిరిగింది లేదు. రామ్ గోపాల్ వర్మ తొలి చిత్రం ‘శివ’లో అమలకు అన్నయ్యగా నటించారు. ‘అంకురం’లోనూ ముఖ్యపాత్ర ధరించారు. ఆ తరువాత ఎందుకనో సాయిచంద్ వైపు ఎవరూ చూడలేదు. ఆయన కూడా తనకు పాత్రలు ఇవ్వండి అంటూ ఎవరినీ అడగలేదు. దాదాపు రెండున్నర దశాబ్దాల తరువాత శేఖర్ కమ్ముల తన ‘ఫిదా’లో హీరోయిన్ తండ్రి పాత్రకు సాయిచంద్ ను ఎంచుకున్నారు. ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో మళ్ళీ సినిమా జనం సాయిచంద్ వైపు చూడడం మొదలెట్టారు.
‘ఫిదా’ తరువాత చిరంజీవి తొలి చారిత్రక చిత్రం ‘సైరా…నరసింహారెడ్డి’లోనూ, ‘ఉప్పెన’లోనూ గుర్తింపు ఉన్న పాత్రలే పోషించారు సాయిచంద్. ‘చెక్’లో కూడా సాయిచంద్ కనిపించారు. రానా ‘విరాట పర్వం’లో ఓ కీలక పాత్ర ధరించారు. నటునిగా సాయిచంద్ పరిధి చిన్నగానే కనిపించినా, అందులో ఆయన ధరించిన వైవిధ్యమైన పాత్రలు మాత్రం చిన్నవేమీ కావు.
తెలుగునేలను చైతన్యవంతంగా మార్చిన మహనీయుల్లో ఒకరిగా నిలచిన త్రిపురనేని రామస్వామి మనవడు సాయిచంద్. త్రిపురనేని గోపీచంద్ తనయుడు. గోపీచంద్ రచయితగా ఎంతో పేరున్నవారు. చిత్రసీమలోనూ ఆయన దర్శకునిగానూ రాణించారు. గోపీచంద్ కు ఆయన తండ్రి రామస్వామి ‘ప్రశ్నించడం’ నేర్పారు. కానీ, సాయిచంద్ తన తండ్రి గోపీచంద్ నుండి ‘ఆలోచించడం’ అభ్యసించినట్టు ఉంది. అందుకే కాబోలు, ఆయనతో ఓ సారి మాట్లాడితే చాలు ఎంతో కొంత జ్ఞానం లభిస్తుందని అంటారు. ఇప్పటికీ అవివాహితునిగానే ఉంటున్న సాయిచంద్, తనకు ‘ఫిదా’ సినిమా ద్వారా సాయి పల్లవి వంటి కూతురు లభించిందని సంతోషిస్తారు.