ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు లిక్కర్‌పై తాజాగా చేసిన కామెంట్లు వైరల్‌గా మారిపోయాయి.. ఇక, సోమువీర్రాజు వీడియోపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే.. అయితే, అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… సోషల్ మీడియా వేదికగా లిక్కర్ అమ్మకాలపై స్పందించిన ఆమె.. చీప్ లిక్కర్‌తో బీజేపీ.. ఖరీదైన మద్యంతో టీఆర్ఎస్ ప్రజలను దోచుకుంటున్నాయని ఫైర్ అయ్యారు..
ఎక్కడ చూసినా మద్యం, ఏ సమయంలోనైనా మద్యంతో నేతలు ప్రజల రక్తం పీల్చుతున్నారంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. మద్యానికి ప్రజలను, యువతను బానిసలను చేస్తున్నారని.. ఇదే సమయంలో మహిళల భద్రతను గాలికొదిలేస్తూ, జోరుగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారంటూ మండిపడ్డారు.. ప్రతి గ్రామంలోనూ, స్కూళ్ల పక్కన కూడా మద్యం అమ్మకాలను నాయకులు జోరుగా సాగిస్తున్నారు అంటూ ట్వీట్ చేశారు వైఎస్ షర్మిల. కాగా, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నిర్వహించిన ప్రజాగ్రహ సభలో మద్యం ధరలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ రూ.50కే ఇస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై వైరల్‌గా మారడం.. వాటిపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేయడం.. ఇప్పుడు ఇద్దరినీ వైఎస్ షర్మిల టార్గెట్ చేయడం జరిగిపోయాయి.