వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. రైతుల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాలుగా మోసం చేసిందని ఆరోపించిన ఆమె.. విత్తనాలు, ఎరువుల మీద సబ్సీడీలు లేవన్నారు. రైతులను బ్యాంక్‌ల దగ్గర డీ-ఫాల్టర్లుగా మిగిల్చారని.. బ్యాక్ వాళ్ళు రైతుల్ని దొంగలుగా చూస్తున్నారని.. రైతుల ఇళ్లను జప్తు చేస్తున్నారని అన్నారు. రైతు భరోసా ఉంటే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారని ప్రశ్నించిన షర్మిల.. 8 ఏళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రైతుల ఆత్మహత్యల పాపం ముమ్మాటికీ కేసీఆర్‌దే తెలిపారు.
60 ఏళ్లు దాటితేనే భీమా అని రైతు నుదుటి మీద మరణ శాసనం రాస్తున్నారని, రైతుని ఏ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకోవడం లేదని వైఎస్ షర్మిల విమర్శించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలో ఏ ఒక్క కుటుంబానికి న్యాయం జరగలేదన్నారు. పెన్షన్లు కూడా సమయానికి ఇవ్వడం లేదని, ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం అవసరమా? అని నిలదీశారు. ముష్టి రూ. 5 వేలు ఇస్తే రైతులు కోటీశ్వరులు అయిపోతారా? రూ. 25 వేలు ఇచ్చే పథకాలు బంద్ పెట్టి, రూ. 5 వేలు ఇస్తూ కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని షర్మిల మండిపడ్డారు. విత్తనాలు, ఎరువుల మీద సబ్సిడీ లేదన్నారు. కేసీఆర్ మంచం కోళ్లు ఎత్తుకు పోయే రకమని ఎద్దేవా చేసిన ఆమె.. వైఎస్సార్ హయాంలో వ్యవసాయం లాభసాటిగా ఉండేదన్నారు.
ఉద్యమ కారుడు కదా అని రెండుసార్లు అధికారం ఇస్తే.. కేసీఆర్ అందరి నెత్తిన టోపీ పెట్టాడని షర్మిల వ్యాఖ్యానించారు. రాష్ట్రం మీద కేసీఆర్ 4 లక్షల కోట్లు అప్పులు చేశారని.. కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే తెలంగాణలో బాగు పడిందని అన్నారు. కేసీఆర్ కుటుంబంలో 5 ఉద్యోగాలు కావాలి.. మీ బిడ్డలు మాత్రం హమాలీ పనులకు పోవాలా? అంటూ ప్రశ్నించారు. వైఎస్సార్ సంక్షేమ పాలన కోసమే తాను పార్టీ పెట్టానని.. నమ్మకంగా సేవ చేస్తానని మాటిచ్చారు. రైతును రారాజు చేస్తానని, భారీగా ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఫీజ్ రియంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేస్తానని.. ఇంట్లో ఉన్న వారందరికీ పెన్షన్లు ఇస్తానని షర్మిల హామీ ఇచ్చారు.