మరోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న ఆమె మాట్లాడుతూ.. మహిళల మాన ప్రాణాలు కాపాడలేని ముఖ్యమంత్రి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అంటూ ఆమె విమర్శలు గుప్పించారు. బంగారు తెలంగాణ ఎవరికి అయ్యిందని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం తప్పా ఎవరు బాగుపడలేదని, ప్రజలు అప్పుల పాలు అయ్యారు.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె ఆరోపించారు.
బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణ.. బార్ల తెలంగాణగా మార్చారంటూ ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. మంచినీళ్లు దొరకవు.. మద్యం మాత్రం ఏరులై పారుతుందంటూ ఆమె ధ్వజమెత్తారు. వైఎస్సార్ పాలన ఒక సంక్షేమ పాలన అని, వైఎస్సార్ పాలన కోసమే పార్టీ పెట్టా అని ఆమె స్పష్టం చేశారు. వైఎస్సార్ బిడ్డగా మాట ఇస్తున్న… వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకు వస్తా అని ఆమె వ్యాఖ్యానించారు.