Betting Apps : డబ్బంటే ఎవరికి చేదు. అదీ సులభంగా డబ్బు వస్తుందంటే.. ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ దాని వెనుక ఎలాంటి మాయా, మోసం ఉందో కూడా తెలుసుకోలేరు. సరిగ్గా ఇదే విధంగా యువత బెట్టింగ్ యాప్స్ బాట పడుతున్నారు. ఆర్ధికంగా నష్టపోయి.. బంగారు భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారు. కొంత మంది అయితే ఏకంగా జీవితాన్ని ముగించేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ వాడుతున్న వారిలో 25 ఏళ్ల లోపు వారేనని ఓ సర్వేలో తేలింది.
ఈజీ మనీ కోసం ఇప్పుడు యువత బెట్టింగ్ యాప్స్‌కు అలవాటు పడుతున్నారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండడం.. ఆన్‌లైన్ ద్వారా సంపాదించవచ్చనే ఉద్దేశ్యంతో చాలా మంది యువకులు వీటికి అట్రాక్ట్ అవుతున్నారు.. బెట్టింగ్ యాప్స్ ద్వారా లక్షలు, కోట్ల రూపాయలు ఒకేసారి వచ్చి పడతాయా? అంటే నమ్మకం ఉండదనే చెప్పాలి. కానీ వస్తాయనే నమ్మకమే వారిని పెట్టుబడి పెట్టేలా చేస్తుంది. కొంత మందికైతే డబ్బులు పోతాయని కూడా తెలుసు.. కానీ వస్తే లక్షలు వస్తాయనే నమ్మకంతో పెట్టుబడి పెడుతున్నారు. ఓ రకంగా వారికి ఇది వ్యసనంలా మారిపోయిందని కూడా చెప్పవచ్చు..
ఇటీవలే బెట్టింగ్ యాప్స్ ద్వారా ఉన్న ఆస్తులు, చేతిలో ఉన్న నగదు అంతా పోగొట్టుకుని అప్పులపాలై ఆ తర్వాత ఉసురు తీసుకున్న యువకులను కూడా మనం చూశాం. ఇలా జేబులు గుల్ల చేసుకుంటున్న వైనంపై ప్రహార్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ‘ఫోర్సెస్ డ్రైవింగ్ ఆన్‌లైన్ బెట్టింగ్ అండ్ గాంబ్లింగ్’ పేరుతో 6 వారాల పాటు సర్వే చేపట్టింది. ఇందులో చాలా నిజాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులే ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారని సర్వేలో తేలింది..
బెట్టింగ్ యాప్స్ బానిసల్లో అత్యధికులు 18- 25 మధ్య వయసు వాళ్లే ఉంటున్నారని వెల్లడైంది. ఇంటర్మీడియట్ వరకు చవిదిన వాళ్లు 41.8 శాతం ఉన్నారు. తేలిగ్గా డబ్బు సంపాదించడానికే బెట్టింగ్ యాప్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు తేటతెల్లమైంది. కానీ అది తర్వాత వ్యసనంలా మారిపోయింది…
ఇటీవల కాలంలో అనేక మంది యువకులు ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్‌లో నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో ఈ యాప్స్‌పై చర్యలు, కట్టడి కోసం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రహార్ సంస్థ చేసిన సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది. ప్లేస్టోర్స్, యాప్ స్టోర్స్‌లో ఉన్న యాప్‌లతో పాటు సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ టెలిగ్రాం ద్వారా వస్తున్న లింకుల ద్వారానే ఈ గేమింగ్, బెట్టింగ్ జరుగుతోంది. పంటర్లలో అత్యధికులు దిగువ మధ్య తరగతికి చెందిన వాళ్లే ఉంటున్నారు. వీరి నెల వారీ ఆదాయం రూ.15 వేల కంటే తక్కువగానే ఉంటోంది…
నిజానికి తెలంగాణలో ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్‌పై నిషేధం ఉంది. దీంతో ఆయా యాప్స్‌లో చాలా వరకు ఇక్కడ పని చేయవు. ఈ కారణంగానే పంటర్లలో 69 శాతం మంది వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్స్ వాడుతున్నారు. 95 శాతం మంది తమ గుర్తింపు బయటపడకుండా జాగ్రత్తపడుతూ నకిలీ పేర్లతో ఆడుతున్నారు. ఇక్కడ నిషేధం ఉన్నప్పటికీ బెట్టింగ్ యాప్స్‌తో పాటు లింకుల ద్వారా అందుబాటులోకి వచ్చే సైట్స్‌ను వినియోగించడం చాలా తేలికని 89 శాతం అభిప్రాయపడ్డారు. 96 శాతం మంది బెట్టింగ్‌పై నిషేధం ఉందని, తప్పని తెలిసీ ,ఈజీ మనీ కోసం ఈ వ్యసనాన్ని కొనసాగిస్తున్నారు…
Delhi: రూ. 84 లక్షల మెర్సిడెస్-బెంజ్‌ను.. రూ.2.5 లక్షలకే అమ్మిన ఓనర్.. కారణం ఇదే..?