తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునఃనిర్మించిన యాదాద్రి శ్రీలక్ష్మినరసింహా స్వామి వారి ఆలయాన్ని వేదపండితులు, అర్చకుల మంత్రోత్చరణల నడుమ ఎంతో వైభవోపేతంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటల నుంచి స్వయంభు లక్ష్మినరసింహా స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించారు. స్వయంభు లక్ష్మినరసింహా స్వామి వారి ఆలయంలోని గర్భగుడి దర్శనాలు ఆరేళ్ళ తర్వాత పునఃప్రారంభమయ్యాయి.
దీంతో స్వామి వారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. అయితే రోజుకు 60 వేల మంది భక్తులు దర్శించునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఓం నమోః నారసింహా నినాదాలతో యాదాద్రి ఆలయం మారుమ్రోగుతోంది. మహా కుంభ సంప్రోక్షణ అనంతరం స్వామి వారిని మొదటగా సీఎం కేసీఆర్ దర్శనం చేసుకున్నారు. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు దర్శనం చేసుకున్నారు.