ఎండ వేడిమితో అల్లాడుతున్న తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని పేర్కొంది.
పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ వివరించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వికారాబాద్ జిల్లా కోటిపల్లిలో 11.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బంట్వారంలో 11, దుద్యాలలో 10.2, ధవలాపూర్‌లో 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఫిబ్రవరి తర్వాత ఒక రోజు వ్యవధిలో 11 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. వేసవి తీవ్రత కూడా అలాగే కొనసాగుతోంది. కుమురం భీం జిల్లా కౌటాలలో అత్యధికంగా 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది.
సాధారణంగా ప్రతి ఏటా జూన్ 1న ఇవి కేరళను తాకుతుంటాయి. ఈసారి కాస్తంత ముందుగానే అంటే ఈ నెల 27నే కేరళను తాకుతాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఇంకా రుతుపవనాలు రాకుండానే కేరళ తడిసి ముద్దవుతోంది. . దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు నిన్ననే రుతుపవనాలు విస్తరించినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 25 తర్వాత ఎప్పుడైనా రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే, రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.
