నగరంలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉక్కపోతతో భాగ్యనగర వాసులు అల్లాడుతున్నారు. గరిష్టంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత.. కనిష్టంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఎండల తీవ్రతతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి సిటీ ప్రజలు జంకుతున్నారు. భానుడి భగభగలతో నగరంలోని రోడ్లు బోసిపోతున్నాయి.
రోజుకు సగటున 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నగరవాసులు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి నగరంలో ఎండల తీవ్రత ఎక్కువగానే కనిపిస్తుంది.
రాష్ట్రంలో పరిశీలిస్తే… ఆదిలాబాద్ జిల్లాలో 43.3 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లాలో 42.2, రామగుండంలో 41.4, హనుమకొండలో41, మహబూబ్ నగర్ లో 40.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. ఈ రెండు రోజులు 41 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
రాబోయే నాలుగు రోజల పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల 48 గంటల్లో హైదరాబాద్ లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.