ప్రస్తుతం నిమ్మకాయ రేటు ఆకాశాన్ని అంటుతోంది. కేజీ నిమ్మకాయల ధర రూ.200పైగా పలుకుతోంది. దీంతో పలువురు వంటల్లో నిమ్మకాయ పులుపు చాలావరకు తగ్గించేశారు. చాలా చోట్ల రెస్టారెంట్లు, హోటళ్లలో ఉల్లిపాయతో పాటు నిమ్మకాయ ఇవ్వడం మానేశారు. అదేదో సినిమాలో వరంగల్‌లో నిమ్మకాయను ఏమంటారంటే నిమ్మకాయనే అంటారనే కామెడీ డైలాగ్ తరహాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో ఉల్లిపాయని నిమ్మకాయ అనాల్సి వస్తోంది. అదేంటి నిమ్మకాయను ఉల్లిపాయ అనడమేంటని అనుకుంటున్నారా? దీని కథేంటో పూర్తిగా తెలుసుకుందాం పదండి.
ప్రతి శుక్రవారం అశ్వారావుపేట పట్టణంలో దుకాణాలకు కొందరు ప్రత్యేకించిన వ్యక్తులు సాంబ్రాణి వేసి ఎర్రటి గుడ్డలో ముడి వేసిన నిమ్మకాయను కడుతుంటారు. ఇలా చేస్తే ఆ దుకాణంలో జరిగే వ్యాపారానికి నరగోష, దిష్టి తగలదని వ్యాపారులు అనాదిగా పాటిస్తూ వస్తున్న నమ్మకం. ఇదంతా చేసినందుకు ఒక్కో దుకాణదారుడు 20 రూపాయలు వీరికి ఇస్తుంటారు. అయితే ఇప్పుడు నిమ్మకాయ ధరలు మండిపోతుండటంతో చిన్న సైజు కాయలే ఒక్కొక్కటి రూ.10 ధర పలుకతున్నాయి. దీంతో ఆ రేటుకు నిమ్మకాయల కొనుగోలు చేసి దుకాణాలకు కట్టలేక, దుకాణదారులు వద్ద ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయలేక మదన పడుతున్న సదరు వ్యక్తులకు బుర్రలో ఈ ఐడియా వచ్చినట్లుంది. అదేంటంటే దుకాణం ముందు కట్టే నిమ్మకాయను ముందుగానే ఎర్రటి గుడ్డలో చుట్టి తీసుకువస్తారు. కాబట్టి అదే ఎర్రటి గుడ్డలో నిమ్మకాయకు బదులు ఉల్లిపాయను పెట్టుకుని వస్తే పోలే అనుకున్నారేమో కానీ ప్రస్తుతం అశ్వారావుపేటలోని దుకాణాల ముందు దిష్టి నివారణకు కట్టే ఎర్ర గుడ్డ తాయత్తులలో వేలాడుతున్నది నిమ్మకాయ కాదు ఉల్లిపాయనే, ఎందుకంటే ఇప్పుడు ఉల్లిపాయ కేజీ వచ్చి 20 రూపాయలు ఉండటమే ఇందుకు కారణం.
ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చిందంటే.. నిమ్మకాయల రేటు చూస్తే భారీగా ఉండడంతో అసలు వీరికి ఎట్లా గిట్టుబాటు అవుతుందని అనుమానం వచ్చిన ఓ దుకాణదారుడు తాయత్తు విప్పి చూడడంతో ఉల్లిపాయ బయటపడింది. ఇదేమీ పెద్ద మోసం కాదనే చెప్పుకోవాలి ఎందుకంటే చిన్నతనం నుండి ఏంతో కఠోర సాధన చేసి నేర్చుకున్న మంత్రాలను జపిస్తూ సాంబ్రాణి వేసి తాయత్తులు కడితే వీరికి ఇచ్చేది చిల్లరే కదా. పాపం ఆ చిల్లర కోసమే వారి ప్రయాసంతా… తమ్మిని బిమ్మి.. బిమ్మిని తమ్మి చేసి ఎలాగోలా బ్రతుకు సాగించడం వృత్తి వ్యాపారాలలో సర్వసాధారణం. అయితే గతేడాది అశ్వారావుపేట పరిసర ప్రాంతాల్లో నిమ్మ పంటకు రేటు లేకపోవడంతో… కాయలను కోసి మార్కెట్‌కు తరలించడానికి కనీసం కూలీ, రవాణా ఛార్జీలు మందం కూడా మిగిలే పరిస్థితి లేకపోవడంతో, ఎంతోమంది రైతులు కాయలను కోయకుండానే వదిలి పెట్టేశారు. దీంతో నిమ్మ తోటల్లో కాయలు నేలరాలి వృధా అయ్యాయి. ఇప్పుడేమో బహు ప్రియం అయ్యి నిమ్మనే ఆధారంగా చేసుకుని జీవించేవారిని ముప్పు తిప్పలు పెడుతుంది. ఈ నిమ్మ పాట్లు ఒక్క అశ్వారావుపేటకే పరిమితం కాదు తెలుగు రాష్ట్రాల్లో అన్నిచోట్లా ఇదే తంతు నడుస్తోంది.
National Flag: 18 ఏళ్ల పాకిస్థాన్ రికార్డును బద్దలుకొట్టిన భారత్