తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు బి. వినోద్‌కుమార్,ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డా, రాజీవ్ కుమార్ ను కలిసి తెలంగాణకు రావాల్సిన నిధుల పై మాట్లాడారు. అనంతరం మీడియాతో వినోద్‌కుమార్ మాట్లాడుతూ భేటీలోని అంశాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో సెక్షన్ 94 ప్రకారం వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం తెలంగాణకు వనరులు ఇవ్వాలని పొందుపరిచారని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని, నాటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కి లేఖలు రాశారని వినోద్‌కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా ఆర్థిక సాయం చేయాలని విన్నవించారు. ఇదే అంశాన్ని నీతి ఆయోగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తెలంగాణ రాష్ట్రానికి 24 వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా ఆర్థిక శాఖ మంత్రికి ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు. కానీ నాటి నుంచి నేటి వరకు దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు.
Read Also:పట్టణ ప్రగతి లక్ష్యాలను పూర్తి చేయాలి: మంత్రి కేటీఆర్
ఈ అంశంపై కేంద్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రులు లిఖితపూర్వకంగా లేఖలు రాయడంతో పాటు కలిసినప్పుడల్లా అడుగుతున్నామని రాజీవ్‌కుమార్‌కు, వినోద్‌కుమార్ వివరించారు. విభజన సమయంలో 9 పాత జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా నీతి ఆయోగ్ గుర్తించింది. బ్యాక్ వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్ కింద నిధులు ఇవ్వాలని సూచనప్రాయంగా చెప్పారని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం ఒక్కో జిల్లాకు 50 కోట్లు చొప్పున 450 కోట్లు మూడు, నాలుగేళ్ళు ఇచ్చారు. 2019-20 నుంచి ఈ నిధులు ఇవ్వడం లేదు. 900 కోట్లు నీతి ఆయోగ్ నుంచి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు వెళ్లి చాలా రోజులు అవుతుందని దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. తప్పకుండా సాయం చేస్తామని చెప్పారని, కొన్ని లేఖలను అందజేసినట్టు వినోద్‌కుమార్ వివరించారు. వారం, పది రోజుల్లో దీనిపై చర్యలు తీసుకుంటామని రాజీవ్ కుమార్ చెప్పారన్నారు.