కెమికల్ కంపెనీలను మూసివేయాలని ఆ గ్రామం పార్టీలకతీతంగా నడుము కట్టింది. కాలుష్యకారక పరిశ్రమలను మూసివేయాలని రెండు నెలలుగా ఎక్కని గడప… మొక్కని దేవుడు లేడు అన్నట్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగా అధికారుల పరిస్థితి ఉంటే… నేతలు తమకు చెవులు కళ్ళు లేవు అన్నట్టుగా వ్యవహరిస్తుండటం పట్ల బాధిత గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారుల తీరు మారకుంటే… వారు స్పందించకుంటే తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు గ్రామస్తులు..
పరిశ్రమలు వస్తే తమ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు, స్థానికులకు ఉపాధి అవకాశాలు వస్తాయని అనుకుంటే… ఆలా వచ్చిన ఫార్మా, కెమికల్ పరిశ్రమలు ఆ ప్రాంతవాసులకు గుదిబండగా, ప్రాణాంతకంగా తయారయ్యాయి ఈపరిశ్రమలు. పరిశ్రమలు ఏర్పాటు జరిగిన నాటి నుండి పరిశ్రమలలో డొల్లతనం, యాజమాన్యం నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణా లోపం కారణంగా అక్కడి ప్రజలకు ఆపరిశ్రమలు శాపంగా మారాయి. వరుసగా విషవాయువుల లీకేజీలు, బయటకు వస్తున్న కలుషిత నీరుతో భూగర్భ జలాలు, పరిశ్రమ నుండి వస్తున్న పొగతో గాలి కాలుష్యం అవుతుంది… ఫలితంగా ప్రజలు పీల్చేగాలి, తాగే నీరు విషతుల్యం కావడంతో ప్రజలంతా ఆందోళన బాట పట్టారు, పీల్చేగాలి, తాగే నీరు కాలుష్యం కావడంతో యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు.
ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న పరిశ్రమలను మూసివేయాలని ఆందోళన బాటపట్టారు. ప్రజల ఆందోళనతో సదరు చందక్, అస్ట్రా పరిశ్రమలను మూసివేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేయడంతో ఆరు నెలల గడువు ఇచ్చింది ప్రభుత్వం… ఆగడువు ముగిసి ఏడాది అవుతున్నా, ప్రభుత్వ ఆధేశాలు అమలు చేయమని సంబందిత అధికారులను అడుగుతున్నా సదరు పరిశ్రమలను మూసివేయకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Botsa Satyanarayana: పదవులు శాశ్వతం కాదన్న మంత్రి బొత్స
యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలంలో ఉన్న రసాయన పరిశ్రమలు కనీస నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారుల నిర్లక్ష్యంతో పరిశ్రమలు యదేచ్చగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల బీబీనగర్ మండలం కొండమడుగు లో ఉన్న రసాయన పరిశ్రమల కాలుష్యంతో యాదాద్రి జిల్లా డేంజర్ జోన్ గా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్రామాలలో తాగునీటి కోసం బోర్ వేస్తే కలుషిత జలాలే వస్తున్నాయని, పశువులు ఆ మనుషులు భూగర్బ జలాలు తాగే పరిస్థితి లేదని… రసాయన వ్యర్థ జలాలతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని… పరిశ్రమలు వాటి కాలుష్యంపై అనేక సందర్భాలలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినా పరిశ్రమవైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామస్తులకు పరిశ్రమ అన్ని రకాలుగా ప్రజలకు హాని కలిగిస్తుంటే వాటిని ఎందుకు మూసివేయడం లేదని మండిపడుతున్నారు గ్రామస్తులు. కొండమడుగు గ్రామ పరిధిలోని చందక్ లాబరేటరీ, ఆస్ట్రా ఇండస్ట్రీస్, అజంతా రసాయన పరిశ్రమలు వెంటనే మూసివేయాలని కొండమడుగు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే భూగర్భ జలాలు తాగేందుకే కాదు.. కనీస ఉపయోగానికి కూడా ఏమాత్రం పనికి రాకుండా మారిపోయాయి. దీంతో ప్రజలు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. కాలకూట విషాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలనుండి ప్రజలను రక్షించాలని అనేకసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని… దీంతో గ్రామస్తులు పార్టీలకతీతంగా 58రోజులుగా నిరసనదీక్షలు చేస్తున్నారు గ్రామస్తులు.
పరిశ్రమలను మూసేయాలని ప్రభుత్వ ఇచ్చిన గడువు ముగిసి ఏడాది అవుతున్నా పరిశ్రమల శాఖ, కాల్యుష్య నియంత్రణా మండలి, విద్యుత్ శాఖ, రెవెన్యూ, పోలీస్, శాఖలు పరిశ్రమవైపు కన్నెత్తికూడా చూడటంలేదని… గ్రామస్తులుగా తాము సంబంధిత అధికారులకు వినతి పత్రాలు ఇఛ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇఫ్పటికైనా అధికారులు మేలుకొని తగిన చర్యలు తీసుకొకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు గ్రామస్తులు.
Read Also: Waltair Veerayya: పోస్టర్స్ తోనే హీట్ పెంచుతున్నారు…