బీజేపీ పార్టీనీ చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నాడని అన్నారు జాతీయ బీజేపీ కార్యవర్గ సభ్యులు విజయశాంతి… నిజామాబాద్ జిల్లా భోధన్ లో జరిగిన రైతు సదస్సుకు ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మోదీ మీద కోపంతో, బీజేపీ పార్టీపై భయంతో రైతులను కేంద్రంపైకి కేసీఆర్ రెచ్చగొడుతున్నారని ఆమె ఆరోపించారు. రైతులు సంయమనంతో ఆలోచించాలని… బీజేపీ ద్వారా మాత్రమే రైతులకు మేలు, న్యాయం జరుగుతుందిని విజయశాంతి అన్నారు. వరి ధాన్యం కొనుగొలు విషయంలో 8 ఏళ్లుగా లేని వివాదం ఇప్పుడు ఎందుకు వస్తుందో రైతులు అందరూ ఆలోచించాలని విజ్జప్తి చేసారు. నిజామాబాద్ జిల్లా బోధన్ లో జరిగిన రైతు సదస్సుకు హాజరైన ఆమె రైతులను ఈ వేదిక నుండి కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు.
హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓటమి, 4 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి రావడంతో కేసీఆర్ మతి భ్రమించి రైతులను ఉసిగొలుపుతున్నాడని ఆమె మండిపడ్డారు. కేంద్రం తెచ్చిన కొత్త రైతు చట్టాలను కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ఉధ్దేశ్యపూర్వకంగా వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెచ్చాయని విజయశాంతి అన్నారు. రైతులపై ప్రేమ ఉన్న కేసీఆర్ ఇంతవరకు రుణమాఫీ ఎందుకు చేయలేదో, ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాలను ఎందుకు పరామర్శించలేదో, వారికి ఎందుకు భరోసా కల్పించలేదో రైతులకు కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. 8 ఏళ్లుగా మాయమాటలతో పబ్బం గడుపుతున్న కేసీఆర్ కు రైతులు బుద్దిచెప్పే సమయం ఆసన్నమైందని.. రైతులు అందరూ ఏకతాటిపై నడిచి టీఆర్ఎస్ మోసాలను ఎండగట్టాలని విజ్జప్తి చేసారు.