దర్భంగా పేలుళ్ళపై బీజేపీ నేత విజయశాంతి తన దైన శైలిలో కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఉగ్రవాదులకు హైదరాబాదుతో ఉన్న సంబంధాలు దర్భంగా పేలుళ్ళతో మరోసారి బట్టబయల య్యాయని… దేశంలో ఎక్కడ ఉగ్రవాద ఘటనలు జరిగినా హైదరాబాదుతో లింక్ ఉండటం కలవరపరుస్తోందని పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే ఇవన్నీ తెలంగాణ సర్కారును అప్రతిష్టపాలు చేసే సిగ్గుచేటైన పరిణామాలు తప్ప మరొకటి కాదని… హైదరాబాదును విశ్వనగరం చేస్తామని ఏడేళ్ళుగా గప్పాలు కొడుతూ నెట్టుకొస్తున్న సీఎం కేసీఆర్ గారి సమర్థత ఈ నగర ప్రజల సామాజిక భద్రతను గాలికొదిలేసి అన్ని విధాలుగా భ్రష్టుపట్టించిందే తప్ప చేసిందేమీ లేదని చురకలు అంటించారు.
read also : తెలకపల్లి రవి : జలవివాదంలో వింత మాటలు, కేంద్రానికి తాళాలు
”పోలీస్ శాఖ, నిఘా విభాగాలను ప్రతిపక్షాలపైకి ఉసిగొల్పడానికే తప్ప ఉగ్రవాదులు, అసాంఘిక శక్తుల నిర్మూలనకు వినియోగించిన దాఖలాలే లేవు. నగరాన్ని కల్లోలపరుస్తున్న ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్‌ని ఎన్ఐఏ గుర్తించే వరకూ వాటి గురించి తెలియని అజ్ఞానంలో ప్రభుత్వం ఉందంటే నమ్మేంత అమాయకులెవరూ ఇక్కడ లేరు. గతంలో బయటపడిన మరొక ఉగ్రవాద కుట్రలో కూడా అనుమాని తులను బయటి పోలీసులే వచ్చి అరెస్ట్ చేశారు. మైనార్టీల ఓట్ల కోసం తమ సయామీ ట్విన్ ఎంఐఎం లాంటి మతవాద పార్టీని సంతృప్తిపరచడం మాత్రమే అధికార టీఆరెస్ సర్కారుకు చేతనైన ఒకే ఒక పనిగా కనిపిస్తోంది.” అంటూ విజయశాంతి ఫైర్ అయ్యారు.