Vemulawada : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రస్తుతం అభివృద్ధి పనులు, ఆలయ విస్తరణ కారణంగా తాత్కాలికంగా దర్శనాలను రద్దు చేసింది. అయితే, కార్తీక మాసంలో రాజన్న దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, ప్రధాన ఆలయం మూసివేయడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఆలయ విస్తరణ, పునర్నిర్మాణ పనులను భక్తులు స్వాగతిస్తున్నప్పటికీ, ముందస్తు సమాచారం లేకుండానే బుధవారం (నవంబర్ 11) ఉదయం నుంచి దర్శనాలను నిలిపివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఆలయాన్ని ఎన్ని రోజుల పాటు మూసివేస్తారనే విషయంలో అధికారులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడం భక్తులలో తీవ్ర అయోమయాన్ని సృష్టిస్తోంది. గతంలోనూ ఆలయాన్ని మూసివేసినప్పుడు ఇలాంటి గందరగోళమే తలెత్తి, బీజేపీ సహా హిందూ సంస్థల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం 20 గుంటల్లో ఉన్న రాజన్న ఆలయాన్ని విస్తరణలో భాగంగా 4 ఎకరాల 2 గుంటలకు పెంచనున్నారు. ఈ విస్తరణ పనుల కారణంగానే ప్రధాన ఆలయ పరిసరాల్లో కూల్చివేతలు మొదలయ్యాయి.
అయితే, ఆలయాన్ని మూసివేస్తే కచ్చితమైన ప్రకటన ఇవ్వాలని, ఎన్ని రోజుల పాటు దర్శనాలు నిలిపివేస్తారో స్పష్టం చేయాలని భక్తులు, హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. “ఆలయాన్ని మూసివేయలేదు, పూజలు యథావిధిగా జరుగుతున్నాయి. అత్యవసరం ఉన్నప్పుడే దర్శనాలు నిలిపివేస్తున్నాం” అని అధికారులు చెబుతున్నప్పటికీ, ఈ ప్రకటనతో భక్తులు సంతృప్తి చెందడం లేదు. అకస్మాత్తుగా ఆలయం మూసివేయడంతో, రాజన్న దర్శనం కోసం వచ్చిన భక్తులు నిరాశతో వెనుదిరగకుండా.. భీమేశ్వరాలయంలో స్వామివారిని దర్శించుకుంటున్నారు.
కోడె మొక్కులు, కుంకుమ పూజలు, అభిషేకాల వంటి సేవలను కూడా అక్కడే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి, ప్రధాన ఆలయంలో స్వామివారి రథాన్ని ప్రదర్శించి, గర్భగుడిలో జరుగుతున్న పూజలను భక్తులు చూసేందుకు ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ప్రధాన ఆలయానికి తాళాలు వేసి, అభివృద్ధి పనులు జరుగుతున్న కారణంగా ఆలయాన్ని మూసివేసినట్లు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినప్పటికీ… భక్తులు మాత్రం శివరాత్రి వరకు ప్రధాన ఆలయంలో దర్శనానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Maharashtra: పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనాలను ఢీకొన్న ట్రక్కు.. 8 మంది సజీవ దహనం