Vegetable Prices are Increasing All Time High in Telangana: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఏ కూరగాయను కొందామనుకున్నా.. ధర కొండెక్కి కూర్చుంది. పట్టణాల్లోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో అదే పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని రీతిలో కూరగాయల ధరలు పెరిగాయి. ఎంతలా అంటే.. ఇదివరకు 100-200 రూపాయలు తీసుకెళ్తే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు రూ. 500 తీసుకెళ్లినా.. సంచి మాత్రం నిండడం లేదు. దాంతో కూరగాయల మార్కెట్ వెళ్లాలంటేనే సామాన్య జనాలు భయపడిపోతున్నారు.
సాధారణంగా ఆషాఢ మాసంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు తక్కువ. ఈ కాలంలో అన్ని కూరగాయల ధరలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి బిన్నంగా ఉంది. ఇప్పుడు కూరగాయలు పేద, సామాన్య ప్రజలకు పెను భారంగా మారాయి. ఏ కూరగాయ, ఆకుకూరలు చూసినా.. ధర కరెంట్ షాక్ మాదిరి కొడుతున్నది. దాంతో ‘ఏం కొంటాం.. ఏం తింటాం లే’ అన్నట్లుగా పరిస్థితి ఉంది. కూరగాయలు ధరలు పెదగడంతో పట్టణాల్లోని మార్కెట్, గ్రామీణ ప్రాంతాల్లోని వారపు సంతలు కూడా ఖాళీగా కనబడుతున్నాయి.
Also Read: UP Camel Attack: ప్రేమగా పెంచుకున్న ఒంటె.. యజమాని ప్రాణాలనే తీసేసింది!
ఇదివరకు టమాట కిలో రూ. 15 నుంచి 30లకు లభించేది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ధర రూ. 100 నుంచి రూ.120గా ఉంది. పచ్చి మిర్చి, మెంతికూర కూడా కిలో రూ. 100 పైనే ఉంది. అల్లం ఎలిగడ్డ కూడా కిలో రూ. 200లకు చేరింది. టమాట, పచ్చి మిర్చితో పాటు ప్రతి కూరగాయ ధర ఆకాశాన్నంటాయి. క్యారెట్, వంకాయ, దోసకాయ, బీన్స్, క్యాప్సికం, చిక్కుడు, దొండకాయ, సొరకాయ లాంటి తదితర కూరగాయలు ప్రస్తుతం రూ. 50 నుంచి 80 చేరాయి. దాంతో జనాల జేబుకు చిల్లులు పడుతున్నాయి. కొందరికి అయితే తప్పనిసరి పరిస్థితులలో కూరగాయలు కొనక తప్పడం లేదు. ఇక కోడిగుడ్డు ధర కూడా రూ. 7కు చేరింది.
సరిపడా లోకల్ కూరగాయల అందుబాటులో లేకపోవడం, ఇతర ప్రాంతాల్లో వర్షాలు, ఎండలకు పంటలు దెబ్బతినడం లాంటి పరిణామాలు ధరలు పెరగడానికి అసలు కారణాలుగా ఉన్నాయి. రుతుపవనాల ప్రభావంతో ఇతర రాష్ట్రాల్లో తుఫాను ప్రభావం కూరగాయల పంటలపై పడింది. రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి కూరగాయల దిగుమతి చేసుకోకపోవడంతో.. రవాణా చార్జీలు సైతం ధరల పెరుగుదలకు ఓ కారణం అని వ్యాపారులు అంటున్నారు. మరో 20-30 రోజుల పాటు కూరగాయల ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు.