Uttam Kumar Reddy : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలని, తెలంగాణ ఇరిగేషన్ రంగాన్ని పదేళ్లలో కేసీఆర్ సర్వనాశనం చేశారని ఆయన మండిపడ్డారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ విమర్శలకు మంత్రి లెక్కలతో సహా కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ తన హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి, ఒక్క ఎకరానికి కూడా కొత్తగా నీళ్లు ఇవ్వలేదని ఉత్తమ్ విమర్శించారు. దానికి తోడు కేసీఆర్ నిర్మించిన మూడు బ్యారేజీలు కూలిపోయాయని, ఇది ఆయన వైఫల్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. “ఆనాడు ముఖ్యమంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా అన్నీ తానై వ్యవహరించిన కేసీఆర్.. నేడు మూడు బ్యారేజీలు కూలిపోతే దానికి సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు. 96,108 కోట్ల రూపాయలను 11 శాతం వడ్డీకి అప్పు తెచ్చి తెలంగాణ ప్రజలపై తీరని భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదేళ్ల అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ పాలమూరు, డిండి, ఎస్ఎల్బీసీ (SLBC) ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదో నల్గొండ, మహబూబ్ నగర్ ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. కేసీఆర్ అధికారం దిగే మూడేళ్ల ముందు నుండి ఈ ప్రాజెక్టులపై ఒక్క తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని, తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పనులు మొదలుపెట్టామని వెల్లడించారు. ఇప్పటికే సుమారు 7 వేల కోట్లు పాలమూరు-రంగారెడ్డి కోసం ఖర్చు పెట్టామని, త్వరలోనే వీటిని పూర్తి చేస్తామని నల్గొండ బిడ్డగా మాట ఇస్తున్నానని తెలిపారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టు పెట్టారని ఉత్తమ్ ఆరోపించారు. “ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర వాళ్లు 720 టీఎంసీల నీళ్లు తీసుకెళ్తే, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అది 1442 టీఎంసీలకు పెరిగింది. ఇది తెలంగాణకు చేసిన ద్రోహం కాదా?” అని ప్రశ్నించారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్విచ్ ఆన్ చేయడానికి సహకరించింది కేసీఆరేనని, అపెక్స్ కౌన్సిల్ సమావేశాలను వాయిదా వేసి ఏపీకి మేలు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ తెచ్చిన 88 వేల కోట్ల భారీ అప్పులను తీర్చే పని ఇప్పుడు తమ ప్రభుత్వంపై పడిందని మంత్రి వివరించారు. కేసీఆర్ 11 శాతం వడ్డీకి లోన్లు తెస్తే, తమ ప్రభుత్వం వాటిని రీ-స్ట్రక్చర్ చేసి 7 శాతానికి తగ్గించిందని, తద్వారా రాష్ట్ర ఖజానాకు మేలు చేస్తున్నామని చెప్పారు. అబద్ధాల ప్రపంచాన్ని సృష్టించడంలో కేసీఆర్ సాటిలేరని, ఆయన నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను పదేళ్ల పాటు మోసం చేసిన కేసీఆర్.. ఇరిగేషన్ విషయంలో ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తాము ఎలాంటి రాజకీయం లేకుండా, చిత్తశుద్ధితో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
ట్రెడిషనల్ చీరలో మోడర్న్ గ్లామర్.. అనసూయ స్టన్నింగ్ లుక్స్ వైరల్!