Uttam Kumar Reddy Questions CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ సూటి ప్రశ్న సంధించారు. గతంలో పంట భీమా పథకం ఉండేదని, ఇప్పుడు ఆ భీమా ఎందుకు లేదో చెప్పాలని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. పంట భీమా పథకం లేని రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని అన్నారు. లక్ష రూపాయల రుణ మాఫీ కూడా ఒక పెద్ద బూటకమని విమర్శించారు. చాలా మంది రైతులకి రుణ భారం ఎక్కువైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సమభావ సంఘాల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, మహిళా సంఘాలకు మొండిచెయ్యి చూపిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటులో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలపై దోబూచులాడుకుంటున్నాయని అన్నారు. మునుగొడులో రాష్ట్ర మంత్రులు డబ్బు, మద్యం విచ్చల విడిగా పంచుతూ.. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత దారుణమైన ఎన్నికలు ఎప్పుడు జరగలేదన్న ఆయన.. మునుగోడులో కాంగ్రెస్ విజయం తథ్యమని నమ్మకం వెలిబుచ్చారు.
ఇక రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అణగారిన వర్గాల సమస్యలతో పాటు నిరుద్యోగుల, విద్యార్థుల సమస్యలను తెలుసుకుంటూ ఈ పాదయాత్ర కొనసాగుతోందన్నారు. తెలంగాణలో 23న ఈ యాత్రం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ వచ్చాక దేశవ్యాప్తంగా మతకల్లోలాలు, ద్వేషాన్ని పెంచుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని గ్రామ గ్రామానికి తీసుకెళ్లి, స్థానిక సమస్యలను తెలుసుకుందుకే రాహుల్ ఈ యాత్ర చేస్తున్నారన్నారు. ఈ యాత్రలో దారి పొడుగునా రైతులు, కూలీలు, మహిళలను కలుస్తూ.. వారి సమస్యలు తెలుసుకుని, అందుకు పరిష్కారం కోసం కృషి చేసేందుకే ఈ యాత్ర అన్నారు. ఈ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని.. అది చూసి బీజేపీ నాయకులకు మాట్లాడడానికి నోరు రావడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా రాహుల్ గాంధీ భారత జోడో యాత్ర ఉంటుందని చెప్పారు.