కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా రాష్ట్రంలోని పీహెచ్‌డీ సీట్లను భర్తీ చేయడానికి ఆయా యూనివర్సిటీలు అంగీకరించాయి. ఇప్పటికే దీనిపై విధి విధానాలను రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. సోమవారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి ఆధ్వర్యంలో యూనివర్సిటీల వీసీల సమావేశం జరిగింది. పీహెచ్‌డీ అడ్మిషన్ల విధానంలో అనేక లోపాలు ఉన్నాయని, వాటిని అధిగమించడానికి కొత్త పద్ధతులు అనుసరించాలని ఇప్పటికే యూజీసీ అన్ని రాష్ట్రాలకు సూచించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై చర్చించిన రాష్ట్రంలోని వర్సిటీల అధికారులు.. వీలైతే ఈ ఏడాది నుంచే కామన్ ఎంట్రెన్స్ నిర్వహించి పీహెచ్‌డీ సీట్ల భర్తీ చేపట్టాలనే నిర్ణయానికి వచ్చారు.
కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణకు సంబంధించిన విధానాలపై వచ్చే సమావేశంలోపు తుదిరూపు ఇవ్వాలని వీసీలు నిర్ణయించారు. కాగా, ఈ ఏడాది నుంచే పీజీలో కామన్ క్యాలెండర్‌ను అమలు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జనవరి నుంచి పీజీ కోర్సుల తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. పీజీ విద్యలో అడ్మిషన్ల నుంచి తరగతుల నిర్వహణ, సిలబస్, పరీక్షలు వంటి అన్ని విషయాల్లో అన్ని యూనివర్సిటీలకు ఒకే క్యాలెండర్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. ఈ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించనున్నారు. వారం, పది రోజుల్లో ఈ కామన్ క్యాలెండర్‌ను ప్రకటించాలని వీసీలు నిర్ణయించారు.