తెలంగాణలో పాలిటెక్నిక్ ప్రశ్నా పత్రాలు లీక్ వ్యవహారం కలకలం సృష్టించింది.. దీంతో.. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన రెండు పాలిటెక్నిక్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది తెలంగాణ సాంకేతిక విద్యా మండలి. ఇక, రద్దు చేసిన ఆ రెండు పరీక్షలు ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్నట్టు వెల్లడించారు.. అయితే, ఫిబ్రవరి 8వ తేదీన ప్రారంభమైన పాలిటెక్నిక్ పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాయి.. ఇదే సమయంలో హైదరాబాద్శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్మండలం బాటసింగారంలోని స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ నుంచి పాలిటెక్నిక్ ఫైనలియర్ ప్రశ్నాపత్రాలు లీకయినట్లు అధికారులు గుర్తించారు.. ప్రశ్నాపత్రాల లీక్‌ను గుర్తించిన ఇతర జిల్లాల్లోని ప్రిన్సిపల్స్ బోర్డుకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగు చూసింది.
Read Also: India vs West Indies: టీమిండియా క్లీన్ స్వీప్.. విండీస్‌పై చరిత్ర సృష్టించిన రోహిత్ సేన..
ఈనెల 8, 9 తేదీల్లో జరిగిన మూడో సెమిస్టర్ అప్లయిడ్ ఇంజినీరింగ్ మేథమేటిక్స్, ఐదో సెమిస్టర్లోఎలక్ట్రికల్ సర్క్యూట్ సబ్జెక్టుల ప్రశ్నాపత్రాలను కాలేజీ సిబ్బందే.. లీక్ చేసినట్లు సాంకేతిక విద్యామండలి గుర్తించింది.. పరీక్ష ప్రారంభం కాకముంతే ప్రశ్నాపత్రాలు లీక్ చేసి వాట్సాప్ ద్వారా కొందరికి పంపినట్లు సాంకేతిక విద్యామండలి దృష్టికి వచ్చింది.. ఇక, ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. పరీక్ష సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, పరిపాలన అధికారి కృష్ణమూర్తి, లెక్చరర్ కృష్ణమోహన్‌కు ఇందులో ప్రమేయం ఉన్నట్లు అబ్దుల్లాపూర్ మెట్పీఎస్లో సాంకేతిక విద్యామండలి కార్యదర్శి శ్రీనాథ్ ఫిర్యాదు చేశారు. దీనిపై కేసునమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.. ఇక, పేపర్ లీకేజీపై కళాశాలలోని డిపార్ట్మెంటల్అబ్జర్వర్పై సాంకేతిక విద్యామండలి చర్యలు తీసుకుంది.. మరోవైపు, షోకాజ్ నోటీసులు జారీ చేశారు.. స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పరీక్ష కేంద్రాన్ని రద్దు చేశారు.. అనుమతి ఎందుకు రద్దుచేయకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి షోకాజ్ నోటీసులు జారీచేశారు. మొత్తంగా ముగ్గురిపై ఐపీసీ సెక్షన్ 420తో పాటు తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్ సెక్షన్ 8ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.