దేశంలో ధరల పెరుగుదల, ఉద్యోగాల్లో కోత, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, కార్మిక చట్టాల్లో మార్పులకు వ్యతిరేకంగా మార్చి 28, 29 తేదీల్లో జరుగుతున్న సార్వత్రిక సమ్మె ను తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టిఎస్ యుటిఎఫ్) సంపూర్ణంగా బలపరుస్తున్నట్లు టిఎస్ యుటిఎఫ్ ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానం 2020 ని రద్దు చేయాలని, ఉద్యోగుల కుటుంబాల సామాజిక భద్రతకు ముప్పుగా పరిణమించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని రద్దు చేయాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి 28,29 తేదీల్లో కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన జాతీయ సార్వత్రిక సమ్మెను, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చిన గ్రామీణ భారత్ బంద్ పిలుపును విజయవంతం చేయాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు నిచ్చింది.
సార్వత్రిక సమ్మెకు మద్దతుగా మార్చి 27న జిల్లా, డివిజన్ కేంద్రాల్లో సంఘీభావ ర్యాలీలు నిర్వహించాలని, 28, 29 తేదీల్లో మధ్యాహ్నం సమ్మె ర్యాలీల్లో పాల్గొనాలని నిర్ణయించినట్లు టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి ఒక ప్రకటనలో తెలిపారు. TSUTF కార్యకర్తలు, ఉపాధ్యాయులు అధికసంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.