జాతీయ విద్యా విధానం – 2020 ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని, మన ఊరు – మన బడి ని సమర్థవంతంగా అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర విస్తృత సమావేశం డిమాండ్ చేసింది. దేశంలో విద్యా ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ, రాష్ట్రాల హక్కులు హరించి విద్యపై కేంద్ర పెత్తనాన్ని పెంచేది, లౌకిక తత్వానికి విఘాతం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం – 2020 ని రాష్ట్రంలో అమలు జరపకుండా తిరస్కరించాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశం డిమాండ్ చేసింది.
ఫిబ్రవరి 27,28 తేదీల్లో టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలు నాగర్ కర్నూలులో జరిగాయి. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి హైదరాబాద్ లో తీర్మానాలను పత్రికలకు విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుండి సమాంతరంగా ఇంగ్లీషు మీడియం ప్రారంభించాలనే నిర్ణయాన్ని టిఎస్ యుటిఎఫ్ స్వాగతించింది. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 21,500 ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఇంగ్లీషు మీడియం కోసం అదనంగా అవసరమైన ఉపాధ్యాయుల నియామకానికి చర్యలు చేపట్టాలని కోరింది. పాఠశాల విద్యలో కీలకమైన పర్యవేక్షణాధికారుల ఖాళీలు భర్తీ చేయాలని, అన్ని జిల్లాలకు రెగ్యులర్ డిఈఓ లను, నియోజకవర్గానికి ఒక డిప్యూటీ ఇఓ, ప్రతి మండలానికి ఒక ఎంఈఓ పోస్టును మంజూరు చేసి భర్తీ చేయాలని సమావేశం డిమాండ్ చేసింది.
గత ఏడేండ్లుగా నిలిచిపోయిన ఉపాధ్యాయుల పదోన్నతులు, నాలుగేళ్ళుగా జరగని సాధారణ బదిలీలకు వెంటనే షెడ్యూల్ ప్రకటించాలని, జిఓ 317 ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సివిల్ సర్వీసు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని టిఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేసింది. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగుల కుటుంబాల సామాజిక భద్రతకు శాపంగా మారాయి. రాష్ట్రంలో ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని సమావేశం తీర్మానించింది. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని పటిష్టపరచాలని, అన్ని ప్రభుత్వ శాఖలలోని రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగులందరికీ నగదు రహిత వైద్యం ప్రభుత్వ బాధ్యతగా అందజేయాలని, అవసరమైతే ప్రభుత్వ వైద్యశాలలనే కార్పోరేట్ స్థాయికి అభివృద్ధి చేసి ప్రజలందరితో పాటు ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించాలి.
ఉద్యోగులనుండి 1% లేదా 2% చందా వసూలు చేయాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని టిఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేసింది. గురుకుల పాఠశాలల్లో పనిభారాన్ని తగ్గించాలి. ఈ సమావేశంలో కె జంగయ్య, సిహెచ్ దుర్గాభవాని, సిహెచ్ రాములు, ఎమ్మెల్సీ ఎ నర్సిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, కోశాధికారి టి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు, 33 జిల్లాల నుండి 450 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.