ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో దిక్కుతోచకుండా వున్న ప్రయాణికులపై మరో భారం మోపింది తెలంగాణ ఆర్టీసీ సంస్థ. ఒకటికాదు ఏకంగా రెండుసార్లు టికెట్ ఛార్జీలు పెంచిన ఆర్టీసీ బస్ పాస్ ధరలను కూడా బాగా సవరించింది. దీంతో 30 శాతం వరకూ బస్ పాస్ ఛార్జీలు పెరిగాయి. తాజాగా ప్రయాణికులపై తెలంగాణ ఆర్టీసీ పిడుగు వేసింది. రిజర్వేషన్ ఛార్జీలు పెంచేసింది. పెంచిన రిజర్వేషన్ ఛార్జీలపై ఇప్పటి వరకు అధికార ప్రకటన చేయలేదు ఆర్టీసీ. గుట్టుచప్పుడు కాకుండా ఒక్కో రిజర్వేషన్ పై 20 రూపాయల నుండి 30 రూపాయలకు పెంచింది టీఎస్ ఆర్టీసీ. ఈ పెంచిన ఛార్జీలు వెంటనే అమలులోకి రానున్నాయి. దీంతో టికెట్ ఛార్జీలు మరింత భారం అవుతాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం
ఇప్పటికే టికెట్ ఛార్జీలు పెరిగిన ప్రయాణం భారంగా మారిందని, మళ్ళీ రిజర్వేషన్ ఛార్జీలు పెంచి మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా మార్చారని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇది చాలదన్నట్టు త్వరలో మరో సారి ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయని ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించడంపై మరింత ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రోడ్డుమీదకు వచ్చి బస్ ఎక్కాలంటే జేబులకు చిల్లులు పడుతున్నాయని సామాన్య ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న దూరాలకు కూడా టికెట్ ధరలు భారంగా మారాయంటున్నారు.