ప్రభుత్వం 37 బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది.. గతంలో మాదిరిగా బిల్లులు పెట్టి చర్చ లేకుండా పాస్ చేయవద్దని చెప్పాం అన్నారు టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు.. పార్లమెంట్ లో ముందు ప్రజా సమస్యలపై చర్చ జరగాలని డిమాండ్ చేశాం. తెలంగాణలో పంట మొత్తం కొనాలి.. ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ధాన్యం పంట కొనుగోలు గురించి రెండు నెలల్లో 4,5 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు చర్చించారు. చివరికి చేతులు ఎత్తేసి.. ధాన్యం కొనుగోలు చేయమని చెప్తున్నారు. యాసంగి పంట కొనేదిలేదని చెప్పారు. ఖరీఫ్ లో పండిన ధాన్యం ఎంత కొనేది కూడా చెప్పం అని అంటున్నారు. అఖిల పక్ష భేటీకి హాజరైన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్ళాం. ఈ అంశాలను పార్లమెంట్ లో లెవనెత్తుతాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వ్యవసాయ బిల్లులు రద్దు తో పాటు “కనీస మద్దతు ధర”కు చట్ట బద్ధత, స్వామినాథన్ సిఫార్సులు అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశాం అన్నారు.
ఇక రైతులపై నమోదైన కేసులు ఎత్తేయాలి. మరణించిన రైతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ 3 లక్షలు ఇచ్చారు. ఉద్యమ క్రమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులను కేంద్రం కూడా ఆర్ధికంగా ఆదుకునేందుకు ముందుకు రావాలని డిమాండ్ చేశాం. మా ప్రతిపాదనకు అన్ని పార్టీల నేతలు మద్దతు తెలిపారు. ఓ వైపు వ్యవసాయ చట్టాల బిల్లులను వెనక్కు తీసుకుంటూనే మళ్ళీ విద్యుత్ బిల్లు పెట్టారు. దేశంలో రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. కృష్ణా జలాల పంపకాల అంశాన్ని విచారించేందుకు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. విభజన చట్టంలోని హామీలు అన్ని నెరవేర్చాలి. ఎస్సి, ఎస్టీ బిల్లు అని యూపీ కి సంబంధించిన అంశాల మీద బిల్లు పెట్టారు. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన ఎలాంటి స్పందన లేదు. రైతుల అంశాలపై సభ లోపల, బయట పోరాడుతాం అని పేర్కొన్నారు నామా నాగేశ్వరరావు.