NTV Telugu Site icon

MLC Kavitha: పెట్రోల్‌ బంకుల్లో, గ్యాస్‌ సిలిండర్లపై మోడీ ఫొటోలు పెడతాం..!

Mlc Kavitha

Mlc Kavitha

తెలంగాణలో టీఆర్ఎస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. కేంద్రమంత్రులు సైతం రాష్ట్రంలో పర్యటిస్తూ.. టీఆర్ఎస్‌ సర్కార్‌ను టార్గెట్‌ చేస్తున్నారు.. ఈ మధ్య.. రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. రేషన్‌ షాపు దగ్గర ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో విషయాన్ని లేవనెత్తిన విషయం తెలిసిందే.. అయితే.. పెట్రోల్ బంకుల వద్ద, గ్యాస్‌ సిలిండర్లపైన, యూరియా బస్తాల మీద కచ్చితంగా ప్రధాని మోడీ ఫొటోలు పెడతాం అంటున్నారు టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత.. నిజామాబాద్‌లో కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ.. రూ. 10లక్షల కోట్లు తన మిత్రులకు పంచి పెట్టారు.. కానీ, ప్రజలకు అమలు చేసే సంక్షేమ పథకాలు ఇవ్వొద్దంటున్నారని ఫైర్‌ అయ్యారు..

Read Also: Thatikonda Rajaiah: ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. మరోసారి కడియం ప్రస్తావన..!

కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి పంచాయితీ పెట్టుకుంటున్నారని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత… టీఆర్ఎస్‌ను ఆగం పట్టించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆమె.. ఈ మధ్య నిజామాబాద్‌ వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌… రేషన్‌ దుకాణానికి వెళ్లి ప్రధాని మోడీ ఫొటో పెట్టలేదని గొడవ పడ్డారని మండిపడ్డారు. చరిత్రలో ఎప్పుడైనా రేషన్‌ షాపు ముందు ఫొటోలు పెట్టారా? అని ప్రశ్నించిన ఆమె.. రాష్ట్రంలో ఒకరకమైన ఆందోళనకర పరిస్థితులను సృష్టించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వాట్సాప్‌లో వచ్చే వాటిని యువకులు ఖండించాలని సూచించారు.. ధరలు కేసీఆర్ పెంచలేదు కదా.. పక్కన ఉన్న మహారాష్ట్రలో పప్పులు, పెట్రోల్, ఇతర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయో మనం గమనించాలని పేర్కొన్నారు. అవకాశం వచ్చినప్పుడు ప్రధాని మోడీకి తెలంగాణ ప్రజలు సరైన గుణపాఠం చెబుతారు.. ఆ నమ్మకం తనకు ఉందన్నారు కవిత..