తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన భారతీయ జనతా పార్టీ.. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదేనంటూ ధీమా వ్యక్తం చేస్తోంది.. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఇతర పార్టీ నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు.. సీనియర్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటున్నవారు.. ఇలా అందరినీ కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో.. అధికార టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలడం ఖాయమైనట్టు తెలుస్తోంది.. టీఆర్ఎస్ పార్టీ నేత, ఆలేరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్.. బీజేపీలో చేరబోతున్నారు.. ఈ నెల 4 లేదా 5వ తేదీల్లో ఢిల్లీలో భిక్షమయ్యగౌడ్.. బీజేపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.
Read Also:AP: పవన్ కల్యాణ్ ప్రకటన.. ఆ రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం..
ఇక, కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించిన భిక్షమయ్య గౌడ్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా పనిచేశారు.. గడిచిన రెండు సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగినా ఓటమి తప్పలేదు.. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత చేతిలో పరాజయం పాలయ్యారు.. అయితే, 2019లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. టీఆర్ఎస్ పార్టీలో చేరారు.. ఆలేరులో టీఆర్ఎస్‌లో కీలక నేతగా ఉన్నారు.. కానీ, ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధం అయ్యారు.. టీఆర్ఎస్‌లో సరైన గుర్తింపు లేకపోవడం.. నామినేటెడ్ పోస్టులు ఆశించినా.. నిరాశే ఎదురుకావడంతో.. ఆయన బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలతో చర్చలు జరగగా.. వచ్చేవారం బీజేపీ కండువా కప్పుకుంటారని ప్రచారం సాగుతోంది.