తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి.. అన్ని పార్టీల అగ్రనేతలు మునుగోడు బాట పడుతున్నారు.. తెలంగాణ సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు.. బండి సంజయ్, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు, వ్యూహకర్తలు ఇలా అంతా మునుగోడు బాట పడుతున్నారు.. వరుసగా మునుగోడు గడ్డపై అగ్రనేతలు అడుగుపెడుతున్నారు.. ఇవాళ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. మరోవైపు కాంగ్రెస్ సారథి రేవంత్ రెడ్డి కూడా మునుగోడులో పర్యటించనున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం బీజేపీ తలపెట్టిన భారీ బహిరంగ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొనబోతున్నారు.. ఇక, అమిత్‌షా సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఇవాళ మునుగోడు వెళ్తున్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. మొత్తంగా నేతల వరుస పర్యటనలు మునుగోడులో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు.
మునుగోడుకు గులాబీ బాస్..
నేడు మునుగోడులో ప్రజా దీవెన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది టీఆర్ఎస్ పార్టీ… ఈ సభకు గులాబీ పార్టీ బాస్, సీఎం కేసీఆర్ హాజరుకాబోతున్నారు.. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు రోడ్డు మార్గంలో మునుగోడు వెళ్లనున్నారు కేసీఆర్.. భారీ కాన్వాయ్ తో మునుగోడు గడ్డపై అడుగుపెట్టనున్నారు.. కేసీఆర్ పర్యటన దృష్ట్యా మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్ – విజయవాడ 65వ జాతీయరహదారి పై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు చిట్యాల నుంచి రామన్నపేట మీదుగా మళ్లించనున్నట్టు పోలీసులు ప్రకటించారు. మునుగోడులో సాయంత్రం 4 గంటలకు సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించే అవకాశం ఉంది.. సీఎం సభ నేపథ్యంలో చర్లగూడెం, కిష్టరాంపల్లి భూనిర్వాసితుల ముందస్తు అరెస్టు చేశారు పోలీసులు.. కేసీఆర్ సభతో అప్రమత్తమైన పోలీసులు.. మొత్తం 1300 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.. ఐజీ కమలహాసన్ రెడ్డి ఆధ్వర్యంలోబందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఆరుగురు ఎస్పీలు, ఆరుగురు ఏఎస్పీలు, 23మంది డీఎస్పీలు. 50మంది సీఐలు, 94 ఎస్సై లు, ఇతర సిబ్బంది, ఏ ఎస్సైలు, కానిస్టేబుళ్లు.. 8 స్పెషల్ పార్టీ బృందాలు, 4 తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ లతో సీఎం సభకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
పీసీసీ చీఫ్ టూర్..
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మరోసారి మునుగోడు బాట పట్టారు.. ఇప్పటికే చండూరులో భారీ బహిరంగ సభ నిర్వహించి సత్తా చాటింది కాంగ్రెస్ పార్టీ.. పాదయాత్ర కూడా చేపట్టారు.. అయితే, కరోనాబారిన పడ్డ రేవంత్‌రెడ్డి ఆ పాదయాత్రకు దూరమయ్యారు.. ఇక, ఇవాళ్టి నుంచి ఆయన రంగంలోకి దిగనున్నారు.. ఇవాళ్టి నుంచే మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఒకే రోజు 5 మండలాల్లో పాదయాత్రకు ప్లాన్ చేశారు. ఇక అదే సమయంలో నియోజకవర్గంలోని 175 గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్రలు చేయనున్నారు. రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని… 175 గ్రామాల్లో జయంతి వేడుకలు నిర్వహించేలా కాంగ్రెస్ శ్రేణులు ప్లాన్ చేశాయి. ఇవాళ పోర్లుగడ్డ తండాలో పాదయాత్ర చేయనున్నారు రేవంత్ రెడ్డి, చౌటుప్పల్ లో మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. మన మునుగోడు మన కాంగ్రెస్ ను కాపాడుకుందాం నినాదంతో నియోజకవర్గంలోని 175 గ్రామాల్లో కాంగ్రెస్ ఇన్చార్జులు, ముఖ్య నేతలు పాదయాత్ర చేయబోతున్నారు.
అమిత్ షా వస్తున్నారు.. రాజగోపాల్‌రెడ్డిని ఆహ్వానించనున్నారు..
ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే రాజీనామా చేశారు.. భారతీ జనతా పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు.. రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.. ఇప్పటికే రెండు దఫాలుగా అమిత్‌షాను కలిసిన రాజగోపాల్‌రెడ్డి.. మునుగోడు వేదికగానే బీజేపీలో చేరనున్నట్టు ప్రకటించారు.. ఇప్పటికే మునుగోడుపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.. కీలక నేతలను రంగంలోకి దిగించింది.. ప్రచారంలో మునిగిపోయింది.. ఆదివారం జరగనున్న భారీ బహిరంగ సభకు అమిత్‌షా హాజరుకానున్న నేపథ్యంలో.. జన సమీకరణ కోసం ప్రత్యేకంగా నేతలను నియమించారు.. ఈ సభా వేదికగా అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకోనున్నారు.. అమిత్ షా సభతో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతోంది బీజేపీ.. ఇక, అమిత్‌షా పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు నేడు మునుగోడు వెళ్లనున్నారు కిషన్‌రెడ్డి.. ఉదయం 11 గంటలకు మునుగోడు చేరుకోనున్న ఆయన.. రేపటి అమిత్ షా బహిరంగ సభ నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలిస్తారు.. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి ఆయన పర్యటన సాగనుంది..
అభ్యర్థులపై రాని క్లారిటీ..
మునుగోడులో పొలిటికల్ హీట్ పెరిగినా అభ్యర్థులపై ఇంకా క్లారిటీ రాలేదు.. ప్రధాన పార్టీలుగా ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి చెందిన కీలక నేతలు నేరుగా గ్రౌండ్ లోకి దిగిపోయారు.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పి బీజేపీలో చేరిన నేపథ్యంలో.. మరోసారి మునుగోడు నుంచి ఆయన పోటీ చేయడం ఖాయమైపోయింది.. మునుగోడు ఉప ఎన్నికలు తెలంగాణ రాజకీయాలనే మార్చేస్తాయని ఆయన చెబుతున్నారు. ఇక, రాజగోపాల్‌రెడ్డి తమ పార్టీని వీడినా.. తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పావులు కదుపుతోంది.. ప్రత్యేక వ్యూహరచనతో రంగంలోకి దిగుతున్నారు ఆ పార్టీ నేతలు.. నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉండడంతో.. మునుగోడులో గెలిచి.. తమ జైత్రయాత్ర కొనసాగిస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. మునుగోడు గడ్డ.. కాంగ్రెస్ అడ్డా అంటున్నారు. కానీ, ఇప్పటి వరకు అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు.. ఇద్దరు, ముగ్గురి పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు.. అధికార టీఆర్ఎస్ పార్టీలో మునుగోడులో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.. ఎలాగేనా ఉప ఎన్నికల్లో విక్టరీ కొట్టి సత్తా చాలాని భావిస్తోంది.. బలమైన నేతను బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తోంది.