Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాల ప్రజలు జాగ్రత్త..!

రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు. రానున్న రెండు రోజులు వాతావరణం క్రింది విధంగా ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు. శనివారం(19-07-2025) : శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురంమన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

“మనమీద నెట్టే రకం”.. మద్యం కుంభకోణంపై స్పందించిన సీఎం చంద్రబాబు..

మద్యం కుంభకోణంపై ఎంపీలతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణంలో సిట్ విచారణ తుది దశకు చేరిందన్నారు. అన్ని ఆధారాలతో గత పాలకులు అడ్డంగా దొరికారని.. ప్రజాధనం ఎలా దోచుకోవచ్చో మద్యం స్కామ్ ఒక పరాకాష్ఠ అన్నారు. దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. కేసు విచారణ పారదర్శకంగా జరగాలనే ఇప్పటివరకు మాట్లాడలేదని.. జగన్ తాను చేసిన తప్పుల్ని కూడా మన మీద నెట్టే రకమని విమర్శించారు.. కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తున్నందున ఎంపీల తీరు ఇంకా మెరుగుపడాలని తెలిపారు. రాష్ట్ర అంశాలే ప్రధాన అజెండాగా ఎంపీలు ఇంకా బాగా మాట్లాడాలన్నారు. రాష్ట్ర ప్రగతిని దేశస్థాయిలో వివరించాల్సిన బాధ్యత ఎంపీలదే అని సీఎం వెల్లడించారు. క్రిమినల్స్ తో రాజకీయాలు చెయ్యాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేశారు.

భర్తతో సె*క్స్‌కు నిరాకరించినా భార్యకు విడాకులు ఇవ్వొచ్చు..

వివాహం తర్వాత భర్తతో ‘‘శృంగారానికి’’ నిరాకరించడం కూడా విడాకులకు కారణం కావచ్చని బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇది భర్త పట్ల క్రూరత్వానికి సమామని చెప్పింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థిస్తూ, భార్య పిటిషన్‌ని కొట్టేసింది. భర్తతో శారీరక సంబంధాన్ని తిరస్కరించడం, అతనితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించడం విడాకులకు కారణం కావచ్చని హైకోర్టు పేర్కొంది. దీనికి ముందు, విడాకుల కేసులో ఫ్యామిలీ కోర్టు.. భర్తతో శారీరక సంబంధానికి నిరాకరించడం, అతడికి వివాహేతర సంబంధం ఉందని అనుమానించడంతో విడాకులు మంజూరు చేసింది. అయితే, ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను మహిళ హైకోర్టులో సవాల్ చేసింది. మహిళకు హైకోర్టులో కూడా చుక్కెదురైంది. ఈ కేసులో ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. జస్టిస్ రేవతి మోహితే డెరే,జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం ఈ వ్యాఖ్య చేసింది. సదరు మహిళ తన భర్త పట్ల క్రూరత్వంతో వ్యవహరించిందని ధర్మాసనం పేర్కొంది.

టీజీ ఎంసెట్ అడ్మిషన్ల మొదటి విడత సీట్ల కేటాయింపు.. చెక్ చేసుకోండిలా..

టీజీ ఎంసెట్ అడ్మిషన్ల మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. కౌన్సిలింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. మొత్తం 172 ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 83,054 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొదటి విడతలో భాగంగా 77,561 సీట్లు కేటాయించారు. మొత్తం 5,493 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆప్షన్లు ఇచ్చినప్పటికీ 16,793 అభ్యర్థులకు సీటు లభించలేదు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) కోటా కింద 6,083 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. 100% ప్రవేశాలు పొందిన కాలేజీల సంఖ్య 82.. కాగా వీటిలో 6 యూనివర్సిటీలు, 76 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. ఈ ఫలితాలను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgeapcet.nic.in ద్వారా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

పార్టీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ.. ఈ 9 అంశాలపై చర్చ..

ఉండవల్లి లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. 9 ప్రధాన అంశాలు అజెండాగా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చ సాగింది. రద్దీ ప్రాంతాల నిర్వహణ, మహిళా నేతలపై అసభ్య ప్రచారంపై మాట్లాడారు. ఏరోస్పేస్ ఇండస్ట్రీ, స్పేస్ సిటీ, పోలవరం-బనకచర్ల, హంద్రీనీవాపై, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీపై చర్చించారు. అమరావతి అభివృద్ధికి చర్యలు, మామిడిరైతులపై పార్లమెంటులో లేవనెత్తడంపై సీఎం దిశానిర్దేశం చేశారు. కాగా… జూలై 21 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్ని రక్షిస్తున్న పాకిస్తాన్.. ఆ ఏడుగురు ఎవరంటే..

పాకిస్తాన్‌ తన ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, కీలక ఉగ్రవాదులను రక్షించాలనేదే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంతో పాటు భారత్ కోరుతున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామంగా ఉంది. వారిని జాతీయ ఆస్తులుగా పాకిస్తాన్ భావిస్తోంది. ముఖ్యంగా, ఏడుగురు టెర్రరిస్టులను దాయాది దేశం రక్షిస్తోంది. వీరందరూ భారత్‌ తో పాటు విదేశాల్లో అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడి పదుల సంఖ్యలో ప్రాణాలు తీశారు. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వీరందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. 1990ల ప్రారంభంలో పాకిస్తాన్ కేంద్రంగా ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ మిషనరీ గ్రూప్ ‘‘మర్కజ్-ఉద్-దవా-వాల్-ఇర్షాద్’’ అనే సైనిక విభాగాన్ని స్థాపించాడు. ఇదే ‘‘లష్కరే తోయిబా’’ ఉగ్రవాద సంస్థ. 2006 ముంబై రైలు పేలుళ్లు, ముంబై‌పై 26/11 దాడులకు బాధ్యత వహించింది. ఈ రెండు దాడుల్లోనే ఏకంగా 360 మందికి పైగా మరణించారు. 2000 ఢిల్లీ ఎర్రకోటపై కూడా ఈ ఉగ్రసంస్థ దాడులు చేసింది. అమెరికా, ఐక్యరాజ్యసమితి ఇతడిని ఉగ్రవాదిగా గుర్తించింది. ఇతడి తలపై 10 మిలియన్ డాలర్ల బహుమతి ఉంది. కానీ, హఫీజ్ సయీద్ మాత్రం లాహోర్‌లో హాయిగా నివసిస్తున్నాడు.

కేసీఆర్‌కు మేము అన్నం పెడితే మాకు సున్నం పెట్టారు

శుక్రవారం (జూలై 18) నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొల్లాపూర్ నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్ శంకుస్థాపన చేశారు. రూ. 200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ విద్యాసంస్థకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాసభలో మాట్లాడుతూ ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. “కొల్లాపూర్ సెగ్మెంట్ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుంది,” అని ప్రకటించిన సీఎం రేవంత్, పాలమూరు ప్రజలు దేశంలో ప్రతిభతో నిలుస్తారని గుర్తు చేశారు. 2009లో కేసీఆర్ పాలమూరుకు వలస వచ్చి ఎంపీగా గెలవడం వెనుక ఈ ప్రాంత ప్రజలే ఉన్నారన్నారు. కేసీఆర్ కు మేము అన్నం పెడితే, ఆయన మాకు సున్నం పెట్టారు అని ఆయన విమర్శించారు.

ఒకటవ తరగతి చిచ్చరపిడుగును మెచ్చుకున్న నారా లోకేష్.. ఇంతకీ ఏం చేసింది..?

ప్రభుత్వ పాఠ‌శాల‌లో ఒకటో తరగతి చ‌దువుకుంటున్న చిన్నారి ప్రతిభ‌కు మంత్రి నారా లోకేష్ ఫిదా అయ్యారు. ఈ చిచ్చరపిడుగుకి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో పంచుకున్నారు. పిల్లల ఆస‌క్తి, త‌ల్లిదండ్రుల ప్రోత్సాహకానికి ఉపాధ్యాయుల కృషి తోడైతే ప్రభుత్వ పాఠ‌శాల్లో ఇలాంటి అద్భుతాలు ఇంకెన్నో చూడొచ్చని పోస్టులో పేర్కొన్నారు. ఈ వీడియోలో కనిపిస్తున్న చిన్నారి అన‌కాప‌ల్లి జిల్లా ఎంపీపీ స్కూల్ బాపాడుపాలెం పాఠ‌శాల‌కు చెందిన ఆరాధ్య. ఒక‌ట‌వ త‌ర‌గ‌తి చదువుతోంది. ఈ చిట్టితల్లి త‌న సృజ‌నాత్మక‌త‌తో మైండ్ మ్యాపింగ్ గేమ్ అడింది. ఆమెను ప్రోత్సహించిన ఉపాధ్యాయులను సైతం లోకేష్ మెచ్చుకున్నారు.

బెంగాల్‌లో మహిళలకు రక్షణ లేదు, దోషులను తృణమూల్ రక్షిస్తోంది..

ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లో పర్యటించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల కోల్‌కతా గ్యాంగ్‌రేప్‌ని ఉద్దేశిస్తూ, నిందితులను కాపాడేందుకు అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రయత్నిస్తోంది, పశ్చిమ బెంగాల్ అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో రూ. 5,400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడానికి ప్రధాని మోడీ ఆ రాష్ట్రంలో పర్యటించారు. మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, క్లీన్ ఎనర్జీని పెంచే లక్ష్యంతో చమురు, గ్యాస్, విద్యుత్, రైల్, రోడ్డు ప్రాజెక్టులను ప్రారంభించారు.

వైసీపీ జిల్లా అధ్యక్షుడి వ్యాఖ్యలపై స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి..

తాడిపత్రిలో వైసీపీ మీటింగ్‌లో వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు.. అనంతపురంలో డంపింగ్ యార్డును తీసేసేందుకు రూ. 24 కోట్లు ఖర్చుపెట్టారని.. తాడిపత్రిలో డంపింగ్ యార్డ్ కు పది కోట్లు ఇచ్చారన్నారు. కానీ ఒక్క రూపాయి కూడా వాడలేదని తెలిపారు. వైసీపీ నాయకులు మీటింగ్ తర్వాత చెత్తను ఎక్కడంటే అక్కడ పడేసి వెళ్లారన్నారు. రోడ్డుపైన వెళుతుంటే చెత్త దుర్వాసన వస్తుందని యాక్సిస్ బ్యాంకు వాళ్లు కంప్లైంట్ చేశారని చెప్పారు. మున్సిపాలిటీ కార్మికులు స్ట్రైక్ లో ఉన్నారని.. కౌన్సిలర్ తో కలిసి వైసీపీ నేతలు చేసిన చెత్తను బయట పారేశామని వెల్లడించారు.

 

Exit mobile version