వల్లభనేని వంశీని పరామర్శించిన కొడాలి నాని, పేర్నినాని
కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ ఇటీవల జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో, ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో ఉన్న ఓ వైసీపీ నేత ఇంట్లో వంశీని మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్నినాని ఆత్మీయంగా కలిసి పరామర్శించారు. అలాగే, వంశీ ఆరోగ్యంపై ఇరువురు నేతలు అడిగి తెలుసుకున్నారు. అయితే, వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్నినాని మధ్య కొంతసేపు పలు అంశాలపై చర్చలు జరిగాయి. వంశీతో పాటు, అన్ని కేసుల్లో అరెస్టైన ఆయన అనుచరులను కూడా కొడాలి నాని పరామర్శించారు. ఈ ఉదయం కోర్టు విధించిన షరతుల మేరకు గుడివాడ, గన్నవరం పోలీస్ స్టేషన్లలో కొడాలి నాని, వల్లభనేని వంశీ సంతకాలు చేశారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ భేటీ.. ఏడు అంశాలకు ఆమోదం
ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 50వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం ముగిసింది. రాజధాని పరిధిలోని అమరావతి మండలంలో 4, తుళ్లూరు మండలంలో 3 గ్రామాల్లో అదనంగా 20, 494 ఎకరాల మేర భూ సమీకరణకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ భేటీకి పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఎస్ విజయానంద్ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మొత్తం ఏడు అంశాలకు సీఆర్డీఏ అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధానిలో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ సహా మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులకు RFP పిలిచేందుకు ఆమోదం తెలిపగా.. మందడం, రాయపూడి, పిచుకలపాలెంలోని ఫైనాన్స్, స్పోర్ట్ సిటీల్లో దాదాపు 58 ఎకరాల్లో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్ ఎఫ్ పీ పిలిచేందుకు ఆమోదం తెలిపింది.
పనిమనిషితో సంబంధం.. తాగి వచ్చిన భర్తను చంపిన భార్య..
భర్తలను భార్యలు చంపుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా పెరిగాయి. అక్రమ సంబంధాల కారణంగా కొందరు కడతేరుస్తుంటే, వైవాహిక సమస్యలతో మరికొందరు భర్తల్ని అంతమొందిస్తున్నారు. ఇదిలా ఉంటే, బెంగళూర్‌లో 32 ఏళ్ల మహిళ తన భర్త మద్యం తాగి ఇంటికి వచ్చిన తర్వాత కొట్టి చంపింది. సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తు్న్న బాధితుడు భాస్కర్(42)కు అతడి భార్య శృతికి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత శ్రుతి రాగి ముద్దను తయారు చేసే వంట కర్రతో కొట్టి చంపింది. ఈ ఘటన నగరంలోని సుద్దగుంటే పాల్య ప్రాంతంలో జరిగింది. భాస్కర్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి 12 సంవత్సరాల క్రితం శ్రుతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మరోసారి కాశ్మీర్ రాగం ఎత్తుకున్న పాక్ ప్రధాని.. భారత్‌పై లేనిపోని ఆరోపణలు..
పాకిస్తాన్ తన నీచబుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది అమాయకుల్ని చంపారనేది సుస్పష్టం. అయినా కూడా, ఆ దేశ నాయకత్వం తమ తప్పు లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అజర్‌బైజాన్ వేదికగా జరిగిన ఆర్థిక సహకార సంస్థ(ఈసీఓ) శిఖరాగ్ర సమావేశంలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారత్‌పై అక్కసును వెళ్లగక్కారు. భారత్ పహల్గామ్ ఉగ్రదాడిని ప్రాంతీయ శాంతి దెబ్బతీసేందుకు ఉపయోగించుకుంటుందని ఆరోపించారు. భారతదేశ ప్రతిస్పందనను ‘‘ప్రేరేపించిన, నిర్లక్ష్య శత్రుత్వం’’గా అభివర్నించారు. ఈ ప్రాంతాన్ని అస్థిరపరచడమే భారత్ ఉద్దేశమని చెప్పారు.
ఐదేళ్ల పాటు అరాచకాలు చేసి.. ఈరోజు నీతులు చెబుతున్నారు!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అధికారం కోల్పోయి మతిభ్రమించి మాట్లాడుతున్నారు అని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాటు అరాచకాలు చేసి.. ప్రజలను పీడించుకొని తిని.. ఈరోజు నీతులు చెబుతున్నారు అని పేర్కొన్నారు. త్వరలో వైసీపీ కార్యాలయానికి టూ లెట్ బోర్డు పెట్టబోతున్నారనే ఆందోళనలో వైసీపీ నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారు.. బియ్యం కొట్టేసిన దొంగతో ప్రెస్ మీట్ పెట్టించడం సిగ్గుమాలిన చర్య అని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.
‘‘ప్రాజెక్ట్ విష్ణు’’తో పాక్, చైనాలో వణుకు.. 12 రకాల హైపర్ సోనిక్ క్షిపణుల్ని రెడీ చేస్తున్న భారత్..
ఓ వైపు పాకిస్తాన్, మరోవైపు చైనా, కొత్తగా ఇప్పుడు బంగ్లాదేశ్.. ఇలా భారత్ చుట్టూ శత్రు దేశాలు ఉన్నాయి. అయితే, వీటిని సమర్థవంతంగా అడ్డుకునేందుకు భారత్ ఇటీవల కాలంలో తన ఆయుధ సంపత్తిని గణనీయంగా పెంచుకుంటోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ స్వదేశీ ఆయుధాల సత్తా పాకిస్తాన్, చైనాలకు తెలిసి వచ్చింది. ఇక ముందు కూడా ఈ రెండు దేశాలకు భయపడేలా భారత్ పెద్ద ప్రాజెక్టుకే శ్రీకారం చుట్టింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ‘‘ప్రాజెక్టు విష్ణు’’పై పని చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ‘‘హైపర్ సోనిక్ మిస్సైల్స్’’ని డెవలప్ చేస్తోంది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతో వీటిని అభివృద్ధి చేస్తోంది. ఇది మొత్తం ఆసియాలోనే పవర్ బ్యాలెన్స్‌ని ఛేంజ్ చేయగలదు. ఈ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న ET-LDHCM వంటి క్షిపణులు మాక్ 8 (సుమారు గంటకు 10,000 కి.మీ.) వేగాన్ని తాకగలవు. దీంతో భారత్ హైపర్ సోనిక్ క్షిపణులు ఉన్న అమెరికా, రష్యా, చైనా జాబితాలో చేరుతుంది.
వాణిజ్య సంస్థలకు ఊరట.. 10 గంటల పని అధికారికంగా అనుమతి
తెలంగాణ ప్రభుత్వం వాణిజ్య సంస్థల (షాపులు తప్పనిసరి) ఉద్యోగుల పనివేళల పరిమితిలో కీలక మార్పు చేసింది. ఉద్యోగులకోసం రోజుకు గరిష్టంగా 10 గంటలు, వారానికి గరిష్టంగా 48 గంటల పని చేయడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పరిధిలో తీసుకున్న నిర్ణయంగా, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. ప్రభుత్వం జూలై 5, 2025న జారీ చేసిన G.O.Rt.No.282 ప్రకారం, 1988లో రూపొందించిన తెలంగాణ షాపులు , ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టంలోని సెక్షన్లు 16, 17 వర్తించని అన్ని వాణిజ్య సంస్థలకు (షాపులు కాకుండా) ఈ నిబంధనలు వర్తిస్తాయి.
మరాఠీ కాదు, వారి బాధ రాజకీయం గురించి.. ఠాక్రే సోదరులపై ఫడ్నవీస్ ఫైర్..
దాదాపు 20 ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరులు తమ విభేదాలను మరిచిపోయి కలుసుకున్నారు. శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రేలు శనివారం ఒకే వేదికను పంచుకున్నారు. వీరిద్దరు చివరిసారిగా 2005లో ఒకే వేదికపై కలిశారు. 2006లో శివసేన నుంచి బయటకు వచ్చిన రాజ్‌ఠాక్రే ఎంఎన్ఎస్ పార్టీని స్థాపించారు. అయితే, ఇప్పుడు వీరిద్దరిని ‘‘మరాఠీ’’ భాష కలిపింది. ప్రాథమిక పాఠశాలల్లో త్రిభాషా సూత్రంలో భాగంగా హిందీని మూడో భాషగా తీసుకురావడాన్ని వీరిద్దరు వ్యతిరేకించారు. అయితే, ఈ ఉత్తర్వులను ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది.
చెన్నమనేని రమేష్ ఓటర్ లిస్టు నుంచి తొలగింపు
వేములవాడ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు ఓటు హక్కు ఇక ఇకలేనిది. రాష్ట్ర హైకోర్టు జర్మనీ పౌరుడని తేల్చిన తీర్పు ఆధారంగా, అధికారులు ఆయన్ను ఓటర్ జాబితా నుండి తొలగిస్తూ అధికారికంగా ప్రకటించారు. వేములవాడ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి & ఆర్డీవో రాధాబాయి, జూన్ 24న ఫారం-7 ద్వారా నోటీసు జారీ చేస్తూ ఏడురోజుల గడువు ఇచ్చారు. గడువు ముగిసిన నేపథ్యంలో, జూలై 3న వేములవాడ నియోజకవర్గంలోని బూత్ నెం.176 ఓటర్ జాబితా నుంచి రమేష్ బాబు పేరు తొలగించినట్లు తెలిపారు. అదేవిధంగా ఆయన నివాసమైన రెండవ బైపాస్ రోడ్డులో నోటీసును అతికించారు. ఈ చర్యలు రాష్ట్ర హైకోర్టు తీర్పు మరియు ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ వివాదానికి వేరుకు కారణం 2009లోనే ఉంది. అప్పట్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ – చెన్నమనేని రమేష్ బాబు భారతీయ పౌరుడు కాదని, నకిలీ పత్రాలతో ఓటర్‌గా నమోదై ఎమ్మెల్యేగా నిలిచారని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం, 2013లో హైకోర్టు రమేష్ బాబు భారతీయ పౌరుడే కాదని, జర్మనీ పౌరుడు అనే తీర్పును వెల్లడించింది.
కాకినాడలో పరువు హత్య కలకలం..
పరువు హత్యలు ఆగడం లేదు. గతంలో ఎవరైనా ప్రేమ జంట.. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత అఘాయిత్యాలు చేసేవారు. కాకినాడ జిల్లాలో తాజాగా ప్రేమ పేరుతో టచ్‌లో ఉన్న యువకున్ని..యువతి సోదరుడు హతమార్చాడు. వేమవరంలో ఈ హత్య కలకలం సృష్టించింది. ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు కిరణ్ కార్తీక్. కాకినాడ జిల్లా వేమవరం స్వస్థలం. అతని తండ్రి వెంకటరమణ ఉప్పాడలో వెల్డింగ్ షాప్ నిర్వహిస్తున్నాడు. తండ్రికి సహాయంగా కిరణ్ కార్తీక్ కూడా అక్కడే పని చేస్తున్నాడు. అయితే షాపులో డబ్బులు విషయంలో తేడా రావడంతో గత నెల 24న వెంకట రమణ.. కొడుకు కిరణ్‌ను మందలించాడు. దాంతో ఇద్దరి మధ్య చిన్న ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కిరణ్ కార్తీక్ ఇంటికి రాకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. ..