Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

కవిత దీక్షకు కోర్టు నో.. ఇంటికి కవిత

హైదరాబాద్‌ ధర్నాచౌక్‌లో కొనసాగుతున్న MLC కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్ష మంగళవారం డ్రామాటిక్ మలుపు తిరిగింది. కోర్టు అనుమతి నిరాకరించడంతో, పోలీసులు కవితను దీక్షా స్థలం నుంచి ఇంటికి తరలించే ఏర్పాట్లు ప్రారంభించారు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే, పోలీసులు మరోసారి కవితను దీక్ష విరమించాలని కోరారు. అయితే కవిత అనుచరులు, జాగృతి కార్యకర్తలు దీక్ష కొనసాగించాలని పట్టుబట్టారు. పోలీసులు వారిని అడ్డుకుంటూ, వర్షం తగ్గిన వెంటనే కవితను లిఫ్ట్ చేయనున్నట్లు సంకేతాలిచ్చారు.

తీవ్ర విషాదం.. స్కూటీని ఢీకొన్న లారీ.. ముగ్గురు విద్యార్థులు మృతి

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం, ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలు వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ తహశీల్దార్ కార్యాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముగ్గురు విద్యార్థులు ప్రయాణిస్తున్న స్కూటీని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు గిరిజన విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు.. ఆ బస్సుల్లో ఫ్రీ

ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అధికారికంగా అమలు చేసేందుకు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో ఏపీ రవాణా శాఖా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. ఆగస్టు 9 న రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకం ప్రకటన చేయనున్నారు. ఆగష్టు 15 నుంచి అధికారికంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు మరింత రక్షణగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

మనతో పెట్టుకుంటే కథ వేరుంటది.. సిరాజ్ సునామి.. ఇంగ్లండ్‌ని చుట్టేసిన స్పెల్!

ఇంగ్లాండ్‌తో ది ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టులో భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ తన సత్తా చాటాడు. మ్యాచ్ చివరి రోజున సిరాజ్‌ వేసిన మ్యాజికల్ స్పెల్ భారత్‌కు అపూర్వ విజయాన్ని అందించింది. 374 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధిస్తున్న ఇంగ్లండ్‌ ఒక దశలో హ్యారీ బ్రూక్ (111), జో రూట్ (105) సెంచరీలతో సునాయాస గెలుపు దిశగా పయనిస్తోంది అనిపించింది. కానీ, సిరాజ్‌ ఊహించని విధంగా పుంజుకుని చివరి రోజు తన ఐదు వికెట్ల ప్రదర్శనతో మ్యాచ్‌ను భారత్ వైపు మలుపు తిప్పాడు.

ఛాంబర్ సంచలన నిర్ణయం.. ఇక ఎవరితో అయినా షూటింగ్ చేసుకోవచ్చు!

వేతనాలు పెంపు విషయంలో తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక ప్రకటన వెలువరించింది. ఈ మేరకు మీడియాకు ఒక లేఖ రిలీజ్ చేసిన నేపథ్యంలో అందులో ఉన్న అంశాలు మీకోసం. తెలుగు చలన చిత్ర పరిశ్రమ తెలంగాణ / ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇప్పటికే చాలా ఇబ్బందికర పరిస్థితులలో ఉంది. ఇటువంటి సమయంలో వేతనాలు పెంచడం, అందులోనూ కార్మిక శాఖ కమిషనర్ మార్గదర్శకత్వంలో, సామరస్యపూర్వక పరిష్కారం కోసం చర్చలు జరుగుతున్న సందర్భంలో ఫెడరేషన్ లేబర్ కమిషనర్ మాటను ధిక్కరిస్తూ 03-08-2025వ తేదిన 04-08-2025 తేది నుండి 30% వేతనాలు, ప్రొడ్యూసర్ నుండి సంబంధిత కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చిన వారికి మాత్రమే, సంబంధిత లెటర్ ఫెడరేషన్ ద్వారా యూనియన్లకు తెలియ చేసిన తరువాత మాత్రమే విధులకు వెళ్ళాలని నిర్ణయించడం చాలా బాధాకరం, ఇది నిజాయితీతో కూడిన చర్చల స్ఫూర్తిని దెబ్బ తీస్తుంది. చిన్న నిర్మాతలు భరించలేని స్థాయిలో వేతనాలు పెంపును యూనియన్స్ డిమాండ్ చేయడం చిన్న నిర్మాతలకు ఆమోదయోగ్యం కాదు, ఆ పెంపు వారు భరించే స్థాయిలో లేదు.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వ‌చ్చే నెల‌ 1 నుంచి కొత్త బార్ పాలసీ.. వారికి 10 శాతం షాపులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ‌చ్చే నెల‌ అంటె సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త బార్ పాలసీ అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా కొత్త బార్ పాలసీ తీసుకొస్తున్నట్లు తెలిపారు. మద్యం పాలసీ అంటే ఆదాయం కాదు… ప్రజల ఆరోగ్యం ముఖ్యం అన్నారు. ఆల్కాహాల్ కంటెంట్ తక్కువ ఉండే మద్యం అమ్మకాలతో నష్టం తగ్గించవచ్చు.. మద్యం కారణంగా పేదల ఇల్లు, ఒల్లు గుల్ల కాకుండా చూడాలన్నారు. బార్లలో కూడా కల్లు గీత కార్మికులకు 10 శాతం షాపులు కేటాయించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇప్పటికే మద్యం షాపుల్లో పది శాతం షాపులు.. కల్లు గీత కార్మికులకు కేటాయించింది ప్రభుత్వం. ఇప్పుడు బార్ లైసెన్స్ లో కూడా ప్రాధాన్యత ఇవ్వనుంది. 840 బార్లలో.. 84 బార్లు కల్లు గీత కార్మికులకు వచ్చే అవకాశం ఉంది.

రిజర్వేషన్లపై తగ్గేదెలే.. ఎన్నికలు ఎలా ఆపాలో మాకు తెలుసు

ధర్నా చౌక్‌ దగ్గర ఎమ్మెల్సీ కవిత చేపట్టిన నిరాహార దీక్ష ముగిసింది. అయితే.. పోలీసులు ఒక రోజుకు మాత్రమే దీక్షకు అనుమతి ఇవ్వడంతో.. జాగృతి సభ్యులు కోర్టును ఆశ్రయించించారు. అయితే.. 72 గంటలు దీక్షకు అనుమతి ఇవ్వలేమని కోర్టు తెలపడంతో ఎమ్మెల్సీ కవిత దీక్షను విరమించారు. అయితే.. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కోర్టు తీర్పును గౌరవిస్తూ.. దీక్షను ఇంతటితో ముగిస్తున్నానన్నారు. పోరాటం ఆగదు.. అనేక రూపాల్లో పోరాటం చేస్తామని ఆమె వ్యాఖ్యానించారు. ఒక్కడుగు వెనిక్కి వేస్తే.. పదడుగులు ముందుకు వేస్తామని ఆమె వ్యాఖ్యానించారు. మీరు రాష్ట్రపతి వద్దకు వెళ్ళండని, సుప్రీంకోర్టులో గవర్నర్ మీద కేసు వేయండని, ఢిల్లీలో టైం పాస్ ధర్నాలు చేస్తే.. తెలంగాణ బీసీ బిడ్డలు ఊరుకోరమన్నారు. మళ్ళీ సమాలోచన చేసి మరో రూపంలో పోరాటం చేస్తామని ఆమె పేర్కొన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ జరగకుండా వెళితే.. ఎన్నికలు ఎలా ఆపాలో మాకు తెలుసు అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బీసీ బిల్లు సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆమె స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్‌కు గువ్వల బాలరాజు రాజీనామా

భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీకి పెద్ద షాక్‌గా మాజీ ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు డా. గువ్వల బాలరాజు రాజీనామా చేశారు. సోమవారం తన పదవులు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం సులభం కాదని, ముఖ్యంగా ఐక్యత అవసరమైన ఈ సమయంలో బాధతో తీసుకున్న నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. “మన నాయకత్వంలో నేర్చుకున్నాను, ఎదిగాను, సేవ చేసాను. పార్టీ ద్వారా లభించిన గుర్తింపు, గౌరవాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను,” అని గువ్వల తెలిపారు. అలాగే, “నా మిషన్ మాత్రం కొనసాగుతుంది – చివరి వరుసలో ఉన్న వ్యక్తిని నిలబెట్టడం నా లక్ష్యం,” అని స్పష్టం చేశారు.

కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ సక్సెస్.. సరిహద్దు ప్రాంత రైతులకి భరోసా

కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆపరేషన్ కుంకీతో సరిహద్దు ప్రాంత రైతులకి భరోసా అని అన్నారు. పంటల్ని ధ్వంసం చేస్తున్న ఏనుగుల్ని.. కుంకీలు దారి మళ్లించాయి.. తొలి ఆపరేషన్ విజయవంతం చేసిన అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలి వద్ద మామిడి తోటలను ధ్వంసం చేస్తున్న అటవీ ఏనుగుల గుంపుని కుంకీలు విజయవంతంగా దారి మళ్లించి అడవిలోకి తరిమికొట్టినట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు. కృష్ణ, జయంత్, వినాయక అనే కుంకీలు ఆ ఆపరేషన్ లో పాల్గొని అడవి ఏనుగులను పంటల వైపు రాకుండా అడ్డుకుని తిరిగి అడవిలోకి మళ్లించాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కొనసాగిన ఈ ఆపరేషన్ లో కర్ణాటక నుంచి తీసుకువచ్చిన కృష్ణ అనే కుంకీ ఏనుగు చాలా చురుకుగా పాల్గొన్నట్టు అటవీ అధికారులు తెలియజేశారు. మొగిలి ప్రాంతంలో 15 రోజులుగా ఏనుగుల సంచారం ఉన్న సమాచారంతో అధికారులు ఈ ఆపరేషన్ చేపట్టారు.

ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లే కాళేశ్వరంపై కమిషన్‌ వేశాం

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ నివేదిక వెలువడిన నేపథ్యంలో, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నివేదికలోని అంశాలను ఎలాంటి మార్పులు చేయకుండా యధాతధంగా క్యాబినెట్‌కు సమర్పించామని ఆయన స్పష్టం చేశారు. “ఇందులో కల్పితాలు ఏవీ లేవు. ఆ సమయంలో తీసుకున్న ప్రతి నిర్ణయం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే జరిగింది,” అని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కాళేశ్వరం నిర్మాణం ప్రభుత్వ నిర్ణయం కాదని, కేసీఆర్ వ్యక్తిగత నిర్ణయమేనని ఆరోపించారు. “తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవు కాబట్టి మెడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించాల్సి వచ్చిందనే వాదన పూర్తిగా అబద్ధం. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు 205 టీఎంసీల నీరు ఉందని అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి స్పష్టంగా ప్రకటించారు,” అని పేర్కొన్నారు. ఘోష్ కమిషన్ కూడా తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత ఉందని తేల్చిందని ఆయన అన్నారు.

 

Exit mobile version