ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్‌లకు బెయిల్ నిరాకరణ..
2020 ఢిల్లీ అల్లర్ల కేసులో కుట్రకు సంబంధించి యాక్టివిస్టులు, జేఎన్‌యూ మాజీ విద్యార్థులు అయిన ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్‌లో పాటు మరో ఏడుగురికి ఢిల్లీ హైకోర్టు మంగళవారం బెయిల్ నిరాకరించింది. జస్టిస్ నవీన్ చావ్లా, షాలిందర్ కౌర్‌తో కూడిన ధర్మాసనం ఈ ఇద్దరితో పాటు మొహమ్మద్ సలీమ్ ఖాన్, షిఫా ఉర్ రెహమాన్, అథర్ ఖాన్, మీరాన్ హైదర్, షాదాబ్ అహ్మద్ అబ్దుల్ ఖలీద్ సైఫీ, గుల్ఫిషా ఫాతిమా బెయిల్ పిటిషన్‌లను కూడా తోసిపుచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇమామ్, ఖలీద్‌ల బెయిల్ పిటిషన్ 2022 నుంచి పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం, హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని వీరి తరుపు న్యాయవాది చెప్పారు.
భారత తొలి ‘‘మైక్రోప్రాసెసర్’’ ఆవిష్కరణ, “విక్రమ్ 3201” ప్రత్యేకతలు ఇవే..
భారత్ పూర్తిగా స్వదేశీ అయిన 32-బిట్ మైక్రోప్రాసెసర్ ‘‘విక్రమ్’’ను ఆవిష్కరించింది. ప్రస్తుత డిజిటల్ యుగంతో మైక్రోప్రాసెసర్లకు చాలా డిమాండ్ ఉంది. ప్రతీ రంగంలో ఇవి కీలకంగా మారాయి. ఇప్పుడు ఈ రంగంలోకి భారత్ సగర్వంగా ఎంట్రీ ఇచ్చింది. చైనాలో జరిగిన ఎస్‌సీఓ సమావేశం నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన ప్రధాని మోడీ ఈ మైక్రోచిప్‌ని మంగళవారం ఆవిష్కరించారు. వీటిని ‘‘డిజిటర్ వజ్రాలు’’గా ప్రధాని పిలిచారు. డిజిటల్ యుగంలో ప్రపంచంలో మైక్రోప్రాసెసర్ల ప్రాముఖ్యతను ప్రధాని మోడీ నొక్కిచెప్పారు.
ఈ రంగంలో ఇప్పటి వరకు తైవాన్, చైనా, దక్షిణ కొరియా, అమెరికా గుత్తాధిపత్యం నడిచేది. ఇప్పుడు భారత్ కూడా ఈ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లైంది. మన చేతి గడియారం నుంచి శాటిలైట్లు, రాకెట్లు ఇలా ప్రతీ దాంట్లో ఈ మైక్రోప్రాసెసర్లు చాలా కీలకం. ఇప్పుడు భారత్ సెమీకండక్టర్, మైక్రోప్రాసెసర్ పరిశ్రమలో ప్రపంచవ్యాప్త పెట్టుబడులను పెంచాలని యోచిస్తోంది. ప్రస్తుతం అంచనా వేసిన 50 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని దాటుతుందని అంచనా. భారత్‌లో సెమీకండర్టర్ భవిష్యత్తును నిర్మించేందుకు ప్రపంచం సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు.
ర్యాపిడో బుక్ చేసుకొని పోయి.. హిమాయత్ సాగర్‌లో దూకి ఆత్మహత్య
రాజేంద్రనగర్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉప్పర్‌పల్లి హ్యాపీ హోమ్స్ కాలనీకి చెందిన ఆరిఫ్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం మధ్యాహ్నం రాపిడో యాప్ ద్వారా బుక్ చేసిన మోటార్ సైకిల్‌పై హిమాయత్ సాగర్ జలాశయానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్నవారి కళ్లముందే జలాశయంలోకి దూకాడు. ఈత రాకపోవడంతో క్షణాల్లోనే నీట మునిగిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు ప్రారంభించాయి. అయితే ఆరిఫ్‌ను ఇప్పటివరకు గుర్తించలేకపోయారు. ప్రాథమిక దర్యాప్తులో, ఆరిఫ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు, ఆసుపత్రి ఖర్చులు భరించే స్థోమత లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పార్టీ కార్యకర్తల కంటే పేగుబంధం పెద్దదేమీ కాదు.. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నాం
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతలు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కంటే ఎవరూ పెద్ద వారు కాదనే విషయాన్ని పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి చాటారని వారు పేర్కొన్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, గత మూడు నెలలుగా కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తల్లో అసహనానికి దారితీశాయని అన్నారు. “ఈరోజు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం స్వాగతించదగ్గది. ముఖ్యంగా మహిళలు కూడా ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం కోసం కవితను సస్పెండ్ చేశారు. పేగుబంధం కంటే పార్టీ ముఖ్యమని కేసీఆర్ చూపించారు” అని పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల సన్నాహకాలు మొదలయ్యాయి. ఇటీవల ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది. మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఈ జాబితాలో ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఇందులో పురుష ఓటర్లు 2,04,288 మంది, మహిళా ఓటర్లు 1,88,356 మంది కాగా, మూడవ లింగానికి చెందిన వారు 25 మంది ఉన్నారు.
వైఎస్సార్ స్ఫూర్తితోనే మా పాలన.. ఆయన ఆశయాలను కొనసాగిస్తాం
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి స్మారక అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైఎస్సార్‌తో తనకున్న అనుబంధాన్ని, ఆయన పాలన స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు. స్నేహానికి, పాలనకు వైఎస్సార్ ఒక నిలువుటద్దమని, ఆయన ఆశయాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. “అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది మిత్రులుగా మన చుట్టూ చేరతారు. కానీ అధికారం పోగానే ఆ మిత్రులు కూడా మాయమైపోతారు. అయితే, వైఎస్సార్-కేవీపీల స్నేహం అలాంటిది కాదు. విద్యార్థి దశ నుంచి వైఎస్సార్ మరణం వరకు కేవీపీ ఆయనకు తోడుగా నిలిచారు. ఇప్పటికీ వైఎస్సార్ ఆలోచనలనే కేవీపీ కొనసాగిస్తున్నారు,” అని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి.
ఉత్తర ప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అక్కడికిక్కడే మృతి..
ఉత్తర ప్రదేశ్ లోని బలరాంపూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికిక్కడే చనిపోయారు. బైక్ రైడర్‌ను కాపాడే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. కొత్వాలి దేహత్ ప్రాంతంలోని నర్కటియా గ్రామం సమీపంలో మంగళవారం ఒక పెద్ద ప్రమాదం జరిగింది. బైక్ రైడర్‌ను కాపాడే ప్రయత్నంలో, ఒక SUV వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
డబుల్ ధమాకా ఉంటుందా..
దీపావళి అంటే టపాకుల పండుగ, అయితే ఈసారి మాత్రం డబల్ ధమాకా ఉండబోతుంది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రకటించారు. సామాన్య ప్రజలకు అనుకూలంగా ఉండేలా జిఎస్టి స్లాబుల్లో మార్పులు రానున్నాయని ప్రధాని స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం నుంచి రెండు రోజులపాటు జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఈసారి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రోజువారీ వినియోగ వస్తువుల ధరలు, హెల్త్ ఇన్సూరెన్స్, ఎలక్ట్రిక్ వాహనాల పన్ను, రాష్ట్రాల ఆదాయం వంటి అంశాలతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
