Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

కవిత ఎవరో నాకు తెలియదు.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎవరో తనకు తెలియదు అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత బీసీ ధర్నా జోక్ అని ఎద్దేవా చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంతో కోట్లాడుతాం అని తెలిపారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఎమ్మెల్సీ కవిత ధర్నాచౌక్‌ వద్ద 72 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే వరకు పోరాటం చేస్తా అని కవిత తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

పవన్ కళ్యాణ్ షూటింగ్ ను అడ్డుకున్న కార్మిక సంఘాలు..

టాలీవుడ్ కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి. రోజు వారి వేతనాలు 30% వరకు పెంచమనడంతో అందుకు ఫిలిం ఛాంబర్ ఒప్పుకోకపోవడంతో నేటి నుండి ఫిలిం ఫెడరేషన్ సంఘాలు షూటింగ్స్ చేయకుండా బంద్ కు పిలుపునిచ్చాయి. దాంతో టాలీవుడ్ లో మీడియం చిన్న సినిమాల షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కానీ బడా నిర్మాణా సంస్థలు మాత్రమే షూటింగ్స్ ను ఆపేది లేదని ఎవరిని లెక్క చేయకుండా షూటింగ్స్ చేస్తున్నాయి. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలో ఒకటైన మైత్రీ మూవీస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తోంది. సీనియర్ నటీనటుల కాంబినేషన్ లో సీన్స్ ఉండడంతో షూటింగ్ ఆపితే ఎక్కువ నష్టం వస్తుందని భావించి షూటింగ్ చేస్తోంది. వేతనాలు పెంపు కొరకు తెలుగు సినిమా కార్మికులు నేటి నుంచి బంద్ కు పిలుపునివ్వడంతో చేసేదేమి లేక ముంబయి నుండి కార్మికులను తెప్పించి మరి షూటింగ్ నిర్వహిస్తోంది మైత్రి సంస్థ. అన్నపూర్ణ స్టూడియో లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుగుతోంది. ముంబై నుండి కార్మికులు వచ్చారని తెలుసుకున్న యూనియ‌న్ ప్ర‌తినిధులు పవన్ కళ్యాణ్ షూటింగ్ ను అడ్డుకోవడానికి వెళ్లాయి. దానితో అక్క‌డ ఇరువురి మధ్య వాదనలు చెలరేగాయి. కార్మికులు ఒక వైపు బంద్ చేస్తుంటే ముంబయి నుండి వర్కర్స్ ను ఎలా తీసుకువస్తారు,  మన కార్మికులు కష్టం హీరో పవన్ కళ్యాణ్ గారికి తెలియదా అని  పవన్ కళ్యాణ్, మైత్రి సంస్థ పై మండి పడుతున్నాయి సినీ కార్మిక సంఘాలు.

లిక్కర్ స్కామ్‌పై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సంచలన వ్యాఖ్యలు

లిక్కర్ స్కామ్‌పై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యం ద్వారా సంపాదించిన సొమ్ముతో బంగారం కొనుగోలు చేయడం, రియల్ ఎస్టేట్, సినిమాలు తీయడం, జింబాబ్వే, టాంజానియా, జాంబియా వంటి దేశాల్లో మైనింగ్‌పై పెట్టుబడులు పెట్టారన్నారు. దుబాయ్, సౌతాఫ్రికాలో పెట్టుబడులు ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో జరిగిన టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా చెవిరెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. గత ఐదేళ్లుగా టీడీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని.. తన ఫోన్‌ను కూడా ఎన్నికల ముందు ట్యాపింగ్ చేశారని చెప్పారు.

మళ్లీ సీఎం కావాలని పూజలు చేశా.. సీఎం, మంత్రి ఫోన్ కాల్ వైరల్!

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడు నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. మినిస్టర్ క్యాంప్ ఆఫీస్‌కు ఇందిరా భవన్‌గా నామకరణం చేశారు. ఆపై యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సదుపాయాలను, భూమి పూజకు సంబంధించిన వివరాలను సీఎంకు మంత్రి వివరించారు. స్కూల్ నిర్మాణ పనులకు భూమి పూజ, క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాలకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కందూరు జైవీర్ రెడ్డి హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డికి ఫోన్ చేయగా.. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడారు. మీరు మరలా సీఎం కావాలని ప్రత్యేక పూజలు చేశా అని సీఎంకు మంత్రి తెలిపారు. అందుకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. ఆపై మిగతా ఎమ్మెల్యేలతో సీఎం మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

జగన్‌ను జైలుకు పంపేందుకు కుట్ర.. కూటమి ప్రభుత్వంపై శిల్పా రవి ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌ను జైలుకు పంపాలని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. లేని స్కామ్‌లను సృష్టిస్తున్నారని ఆరోపించారు. జగన్ చుట్టూ ఉన్న వారిపై కూడా కేసులు పెడుతున్నారన్నారు. జగన్‌ను ఎందుకు స్వేచ్ఛగా తిరగనివ్వడం లేదని ప్రశ్నించారు. జగన్ పర్యటనపై ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారని నిలదీశారు. రాష్ట్ర ప్రజల్లో ఉన్న అసహనం బయటపడుతుందని ప్రభుత్వం భయపడుతుందన్నారు. ఐవీఆర్ఎస్ సర్వే రిపోర్టును బయట పెట్టాలని డిమాండ్ చేశారు. యూరియా బస్తాల పంపిణీలో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గోస్పాడు, నంద్యాల మండలాల్లో టీడీపీ నేతలే యూరియా బస్తాలను పంపిణీ చేస్తున్నారని శిల్పా రవి తెలిపారు.

రేపటి నుండి ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో చండీ యాగం

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో చండీ యాగం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ యాగాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా నిర్వహించనున్నారు. ఈరోజు యాగం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు జరిగిన పూజా కార్యక్రమంలో కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ చండీ యాగం మూడు రోజుల పాటు కొనసాగనుంది. రేపటి నుంచి అధికారికంగా యాగం ప్రారంభమవుతుంది. ఒకవైపు యాగం ఏర్పాట్లు జరుగుతుండగానే, ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపైనే ప్రధానంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. యాగంతో పాటు రాజకీయపరమైన కీలక చర్చలు కూడా ఫామ్‌హౌస్‌లో కొనసాగుతున్నాయి.

కొంతమంది బీఆర్‌ఎస్‌ నేతలను అరెస్ట్‌ చేయొచ్చు.. భయపడొద్దు

సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కీలక సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై కమిషన్ నివేదిక బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆరు గంటలుగా కొనసాగుతున్న ఈ భేటీలో హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి వంటి పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కాళేశ్వరం అంశంపై పార్టీ తరఫున తీసుకోవాల్సిన భవిష్యత్ చర్యలపై చర్చించారు.

హైదరాబాద్‌లో ఈదురుగాలులతో భారీ వర్షం.. నగరమంతా జలమయం

సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. ఒక్కసారిగా కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షం నగరంలో రహదారులను జలమయం చేసింది. ట్రాఫిక్ నిలిచిపోయి, తక్కువ ఎత్తులోని ప్రాంతాలు నీటమునిగాయి. సికింద్రాబాద్‌లో ప్యారడైజ్, మర్రెడ్‌పల్లి, తార్నాక వంటి ప్రధాన రహదారులు వర్షపు నీటితో మునిగిపోయాయి. సాయంత్రం ఆఫీస్ సమయాల్లో వర్షం కురవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. రెండు చక్రాల వాహనదారులు, పాదచారులు వర్షం నుండి తప్పించుకోవడానికి ఫ్లైఓవర్లు, దుకాణాల షేడ్ల కింద తలదాచుకోవాల్సి వచ్చింది. రసూల్‌పురా, కాప్రా, ఆర్‌పీ రోడ్, ఎస్‌పీ రోడ్, పట్నీ క్రాస్‌రోడ్స్, హబ్సిగూడా, డాక్టర్ ఏఎస్ రావు నగర్, నేరేడ్‌మెట్, మల్కాజ్‌గిరి, ఈసిఐఎల్ క్రాస్‌రోడ్స్, ఆల్వాల్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు రహదారులపై నీరు చేరడంతో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, స్థానిక అధికారులు పరిస్థితిని నియంత్రించేందుకు ముమ్మరంగా పని చేశారు.

గెలిచారు.. గెలిచారు.. భారత్ ప్రతీకార విజయం!

ది ఓవల్‌ వేదికగా జరిగిన ఐదో టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించింది. విజయం చివరి వరకు అటువైపా.. ఇటువైపా.. అంటూ ఊగిసలాడగా విజయం చివరకు భారత్ ను వరించింది. దీనితో ఈ సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లను భారత బౌలర్లు మహ్మద్ సిరాజ్ 5 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లు తియడంతో ఇంగ్లండ్‌ కు విజయాన్ని దూరం చేశారు. మొత్తంగా చివిరి టెస్టులో ఉత్కంఠభరితంగా సాగి చివరకు 6 పరుగుల తేడాతో గెలిచి, సిరీస్ ను సమం చేసింది.

పవన్ గొప్ప మనసు.. జీతభత్యాల నుంచి అనాధ విద్యార్థులకు ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప మనసు చాటుకున్నారు. అనాధ విద్యార్థినీ విద్యార్థులకు పవన్ కళ్యాణ్ ఆర్ధిక సహాయం అందించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ తనకు అందుతున్న జీతభత్యాల నుంచి పిఠాపురంలో అనాధ విద్యార్థిని విద్యార్థులకు ఆర్ధిక సహాయం చేస్తున్నారు. ఈ నెల కూడా చెక్కుల రూపంలో ఆర్థిక సహాయం అందచేయడానికి ఏర్పాట్లు చేయవలసిందిగా కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 42 మందికి అయిదువేల రూపాయల చొప్పున చెక్కులను అందజేయనున్నారు. ఈ చెక్కులను జనసేన క్రియాశీలక కార్యకర్తలు బుధవారం పిఠాపురంలో పంపిణీ చేయనున్నారు.

Exit mobile version