అడవుల్లో వుండాల్సిన చిరుతపులులు జనావాసాల్లోకి, పొలాల్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో పంట పొలాల్లోకి వెళ్ళాలంటేనే రైతులు భయంతో బిక్కు
బిక్కుమంటున్నారు..రోజుఎక్కడో ఒకచోట చిరుతల సంచారం కలకలం రేపుతోంది..ఒక్కరోజు మూడు చిరుతలు రైతుల కంటపడడం కేకలు పెడితే అవి అడవిలోకి పారిపోయాయి.. మరుసటిరోజు మరోచోట లేగదూడను చంపేశాయి చిరుతలు.
నిర్మల్ జిల్లాలో చిరుత సంచారం పెరిగిందా? లేక వలస వచ్చిన చిరుతలే సంచరిస్తున్నాయా అనేది అంతుచిక్కడం లేదంటున్నారు స్థానికులు. నిర్మల్ జిల్లాలో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. జిల్లాలోని సారంగపూర్ మండలం బీరవెల్లిలో రాత్రిళ్ళు పంటపొలాలకు వెళ్లే రైతులకు చిరుతలు కనిపించాయి. వెంటనే మిగతా రైతులకు సమాచారం ఇవ్వగా అంతా కలిసి పెద్దఎత్తున కేకలువేశారు. దీంతో చిరుతలు పారిపోయినట్లు రైతులు తెలిపారు. మొత్తం మూడు చిరుతలు కనిపించాలని రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు..
నిర్మల్ జిల్లాలో చిరుత పులుల సంచారం తరచూ పశువులపై దాడిచేస్తూ హతమారుస్తున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతూ ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనతో భయంభయంగా గడుపుతున్నారు.తాజాగా కుంటాల మండలం మేదన్ పూర్ గ్రామంలో లేగ దూడలపై దాడిచేసి హతమార్చింది చిరుత. ఈరెండు ఘటనలతో ప్రజలు, రైతులు తీవ్రభయాందోళనలు వ్యక్తంచేస్తూ బిక్కుబిక్కుమంటూ భయంభయంగా గడుపుతున్నామంటున్నారు.
పంట చేతికొచ్చిన దశలో అడవి జంతువుల బారినుండి పంటలను కాపాడుకునేందుకు రైతులు రాత్రిపూట కాపలాకు వెళ్తున్నారు. రాత్రిపూట చీకట్లో చిరుతపులులు ఏంచేస్తాయోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. సారంగాపూర్, దిలవార్పూర్, కుంటాల, లోకేశ్వరం మండలాల పరిధిలోని ప్రాంతాల్లో గతకొంతకాలంగా ఆవులు లేగదూడలు మేకలపై దాడులు చేస్తూ హతమారుస్తున్నాయి. దీంతో తమ పశువులతో పాటు తమకు సైతం రక్షణలేదనే భావనతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
చిరుత పులులు అటవీప్రాంతంలో మాత్రమే సంచరిస్తాయని అవి ఎవరికీ హాని తలపెట్టవని పంటచేలల్లో సైతం సంచారం చేయవని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. పశువులపై దాడులు చేస్తే తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు. అలా చేస్తే ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఇప్పిస్తామని వాటికి హానికలిగించవద్దని అంటున్నారు అటవీశాఖ అధికారి జైపాల్ రెడ్డి. మహారాష్ట్ర శివారు ప్రాంతాల్లో, అలాగే తెలంగాణలోని వివిధ గ్రామాల శివారు ప్రాంతాల్లో చిరుతలు సంచరిస్తుంటాయని అధికారులు అంటున్నారు. మొత్తానికి చిరుతపులుల సంచారంతో ఎప్పుడేం జరుగుతుందో అని ప్రజలతో పాటు రైతులు భయంభయంగా గడుపుతున్నారు.