TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రజలకు చేరువయ్యేలా, వారి అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త కార్యక్రమాలను చేపడుతోంది. ఇటీవల పర్యాటకులు, భక్తులకు అందుబాటులో ఉండేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రవేశపెట్టిన ఆర్టీసీకి మంచి స్పందన లభిస్తోంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే అందించిన ప్యాకేజీలకు విస్తృత స్పందన లభిస్తుండగా, త్వరలో కాశీ, అయోధ్య వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్రత్యేక సదుపాయాలతో బస్సులను సిద్ధం చేయాలని ఆయన అధికారులు ఆదేశించారు. ఈ ప్యాకేజీలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
ఎండీ సజ్జనార్ ఇప్పటికే ఆర్టీసీ సేవలను గ్రామీణ ప్రాంతాల వరకు తీసుకెళ్లేందుకు పలు వినూత్న ఆలోచనలను అమలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం అంటే సౌకర్యవంతం, సుఖవంతం అనే భావన ప్రతి ఒక్కరిలో కలగాలనే ఉద్దేశంతో పలు మార్పులు చేస్తున్నారు. ముఖ్యంగా “యాత్రాదానం” అనే వినూత్న కార్యక్రమం ద్వారా సామాజిక బాధ్యతను ప్రదర్శించేందుకు ముందుకొచ్చారు.
యాత్రాదానం కార్యక్రమంలో దాతలు తమ ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకొని పేద విద్యార్థులు, అనాథలు, నిరాశ్రయ వృద్ధులు, దివ్యాంగులు వంటి వారిని తీర్థయాత్రలకు, పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు దాతలు ఈ కార్యక్రమానికి ముందుకొస్తుండడం అభినందనీయమని ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. డిపో స్థాయిలోనే ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన సూచించారు.
ప్రజలకు మరింత చేరువయ్యే ఉద్దేశంతో 2023 మేలో టీజీఎస్ఆర్టీసీ “విలేజ్, కాలనీ బస్ ఆఫీసర్” అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో బస్ ఆఫీసర్లు ప్రతి గ్రామం, కాలనీని సందర్శించి ప్రజలతో 15 రోజులకొకసారి సమావేశమవుతున్నారు. ఈ సమావేశాల్లో బస్సుల రాకపోకలు, సమయాలు, కొత్త రూట్లు, కొత్త సర్వీసులు, అలాగే సమస్యల గురించి సమాచారం సేకరిస్తున్నారు. ఆ వివరాలను పై అధికారులకు అందజేసి, తక్షణమే చర్యలు తీసుకోవడానికి సహకరిస్తున్నారు.
గ్రామాల్లో పెళ్లిళ్లు, జాతరలు, శుభకార్యాల సమయంలో రద్దీ పెరిగే అవకాశాలను ముందుగానే గుర్తించి, ఆ సందర్భాల్లో అదనపు బస్ ట్రిప్పులు నడపాలని ఆఫీసర్లు అధికారులకు సూచిస్తున్నారు. అంతేకాకుండా, వివాహాలు, శుభకార్యాలకు బస్సులను అద్దెకు ఇవ్వడం, వస్తు రవాణా కోసం కార్గో సేవలను అందించడం ద్వారా ఆర్టీసీ మరింతగా ప్రజలకు చేరువవుతోంది.
ప్రతి గడపకు ఆర్టీసీ సేవలను తీసుకెళ్లాలన్న లక్ష్యంతో టీజీఎస్ఆర్టీసీ తన కార్యాచరణను ముందుకు తీసుకెళ్తోంది. పర్యాటక ప్యాకేజీలు, యాత్రాదానం, విలేజ్ బస్ ఆఫీసర్ వంటి పథకాల ద్వారా సంస్థ సామాజిక బాధ్యతతో పాటు సేవా దృక్పథాన్ని మరింత బలపరుస్తోంది. త్వరలో ప్రకటించనున్న కాశీ, అయోధ్య టూర్ ప్యాకేజీలు రాష్ట్రంలోని భక్తులకు, పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి.
Meena : ఆ ఫ్లైట్ లో సౌందర్యతో పాటు నేనూ వెళ్లాలి.. మీనా కామెంట్స్