ఈ సారి పదో తరగతి పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. గత రెండు సంవత్సరాలుగా కరోనా ప్రభావంతో పదో తరగతి పరీక్షలు ఆస్పష్టతగా కొనసాగాయి. కరోనా ప్రభావంతో మొదటిసారి పరీక్షలు లేకుండానే విద్యార్థులను ప్రమోట్ చేసింది తెలంగాణ విద్యాశాఖ. అయితే ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో బెంచీకొకరు చొప్పున విద్యార్థులను ‘7’ ఆకారంలో కూర్చోబెట్టే విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే మే 23 నుంచి 28 వరకు పరీక్షలు జరుగనున్నాయి. అయితే ప్రతి ఏటా పదో తరగతి విద్యార్థులు 11 పేపర్లు రాయాల్సి ఉండగా కరోనా కారణంగా ఈసారి 6 పేపర్లకు విద్యాశాఖ కుదించింది.
సైన్స్ సబ్జెక్టులైన జీవ, భౌతికశాస్త్రాల పరీక్షలు ఒకేరోజు వేర్వేరుగా నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 940 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పరీక్ష కేంద్రంలోని తరగతి గదికి 12 నుంచి 24 మంది విద్యార్థులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. చిన్న గదులైతే12 మంది.. పెద్ద గదుల్లోనైతే 24 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంవత్సరం 1,65,683 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. కరోనా నిబంధనలను అనుసరించి ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.