తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో పాల్గొన్న ఉద్యమకారుల సేవలను, వారి త్యాగాలను అధికారికంగా గుర్తించే దిశగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్‌ను పరిష్కరిస్తూ, ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన గౌరవం , సౌకర్యాలు కల్పించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం జీఓ ఆర్టీ నం.679 జారీ చేసింది. తెలంగాణ కోసం కొందరు ప్రాణత్యాగం చేయగా, మరికొందరు లాఠీ దెబ్బలకు శారీరక వైకల్యానికి గురయ్యారు. వేలాది మందిపై కేసులు నమోదై జైలు జీవితం గడిపిన నేపథ్యంలో, వారిని ప్రభుత్వం తరపున గౌరవించాల్సిన బాధ్యత ఉందని భావించి ప్రభుత్వం ఈ అడుగు వేసింది.
ఈ ఉన్నత స్థాయి కమిటీకి ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె. కేశవరావు ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. కమిటీలో సభ్యులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ , విప్ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి నియమితులయ్యారు. సాధారణ పరిపాలన శాఖ పొలిటికల్ సెక్రటరీ ఈ కమిటీకి కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. అసలైన ఉద్యమకారులను గుర్తించేందుకు తొలుత స్పష్టమైన , శాస్త్రీయమైన ప్రమాణాలను రూపొందించడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. ఆ ప్రమాణాల ఆధారంగా సమగ్రమైన ఉద్యమకారుల జాబితాను సిద్ధం చేసి, అనంతరం వారికి ప్రభుత్వం తరపున ఎలాంటి గుర్తింపు, గౌరవ పురస్కారాలు , సంక్షేమ సౌకర్యాలు కల్పించాలనే అంశాలపై ఈ కమిటీ ప్రభుత్వానికి కీలక సిఫారసులు చేస్తుంది.
విధివిధానాల రూపకల్పనలో భాగంగా కమిటీకి విస్తృత అధికారాలను ప్రభుత్వం కల్పించింది. అవసరమైతే సంబంధిత శాఖల అధికారులను పిలిపించుకోవడానికి, సమాచారాన్ని సేకరించడానికి , వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించడానికి కమిటీకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. తన నివేదికను ప్రభుత్వానికి వీలైనంత త్వరగా సమర్పించాలని ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని శాఖల అధికారులు, కార్యదర్శులు ఈ కమిటీకి అవసరమైన పూర్తి సహకారం , సమాచారాన్ని అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయం ద్వారా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యమకారులకు సగౌరవమైన గుర్తింపు లభించే అవకాశం ఉంది.
