యాసంగిలో ధాన్యం కొనుగోలుపై కేంద్రం వర్సెస్ తెలంగాణ ప్రభుత్వంగా మారింది పరిస్థితి.. ఈ వ్యవహారంలో కేంద్రంపై సీఎం కేసీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తుంటే.. అదే రేంజ్‌లో కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర బీజేపీ నేతల వరకు అంతా కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారు. దీంతో.. కేంద్రం వైఖరి ఏంటి? రాష్ట్ర విధానం ఏంటి? అనే దానిపై గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది.. అయితే, యాసంగి ధాన్యం కొంటామని బీజేపీ నేతలు అధికారికంగా ఉత్తర్వులు తీసుకురావాలని డిమాండ్ చేశారు మంత్రి గంగుల కమలాకర్.. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ రైతులు పండించిన యాసంగి పంటను కేంద్రం కొనాలని డిమాండ్ చేశారు. 12న శుక్రవారం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని వెల్లడించిన ఆయన.. రాజ్యాంగ బాధ్యతల నుండి కేంద్రం తప్పించుకోవద్దు అని సూచించారు.
ఇక, తెలంగాణ సీఎం కేసీఆర్ కృషితో 24 గంటల కరెంటు, రైతుబంధు లాంటి పథకాలతో రైతుల కోసం పాటుపడుతోన్న ప్రభుత్వం తమది అన్నారు మంత్రి గంగుల.. కళ్లమంట, కడుపుమంటతో తెలంగాణ రైతుల్ని కేంద్రం అణచివేయాలని చూస్తోందని ఆరోపించారు. యాసంగి ఔటర్న్ ఎఫ్.సి.ఐ కు తెలియదా? అని ప్రశ్నించిన ఆయన.. తెలంగాణ ప్రత్యేక ఉష్ణోగ్రత పరిస్థితుల్లో యాసంగి ధాన్యం విరిగిపోతుందన్నారు.. బాయిల్డ్ గానే ఔటర్న్ సాధ్యపడుతుందని.. లేఖ ద్వారా యాసంగి పారాబాయిల్డ్ తీసుకోమని కేంద్రం చెప్పిందన్నారు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం అదే చెబుతున్నారని.. కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాసంగిలో వరి వేయమని ఎందుకు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అయితే, యాసంగి ధాన్యం కొంటామని బీజేపీ నేతలు అధికారికంగా ఉత్తర్వులు తీసుకురావాలని డిమాండ్ చేసిన మంత్రి గంగుల కమలాకర్.. అప్పటిదాక ఉద్యమిస్తాం.. రైతులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాల్లో పాల్గొనాలని.. కోవిడ్ నిబంధనలు, ఎలక్షన్ కోడ్ పరిధిలోనే ధర్నాలు ఉంటాయని వెల్లడించారు.