రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు నేటితో(ఆదివారం)ముగియనున్నాయి. వజ్రోత్సవాల్లో భాగంగా తొలిరోజైన శుక్రవారం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో జాతీయ పతాకాలతో ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఇచ్చిన పిలుపుతో.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారివారి నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా.. అమరవీరుల స్థూపాల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరులను స్మరించుకున్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు.
మూడు రోజులపాటు జరగనున్న ఈఉత్సవాల కోసం.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మొదటి రోజు రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో.. వేలాది మంది జాతీయ జెండాలు చేతబూని ర్యాలీలు నిర్వహించి.. తెలంగాణ సమైక్యతను ఎలుగెత్తి చాటారు. ఇక నిన్న శనివారం జిల్లా, మండల, గ్రామ స్థాయిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయజెండాను ఎగురవేశారు. హైదరాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లో సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఇవాళ చివరి రోజైన ఆదివారం జిల్లా కేంద్రాల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులకు సన్మాన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
Samaikyatha vajrotsavam: ఇవాళ్టితో ముగియనున్న సమైక్యతా వజ్రోత్సవాలు