Inter Board : తెలంగాణ రాష్ట్రంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇంటర్ బోర్డు పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో, ప్రతీ సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లింపు సమయంలో విద్యార్థుల వ్యక్తిగత వివరాలు, విద్యా సంబంధిత వివరాలు తప్పుగా నమోదు కావడం ఒక పెద్ద సమస్యగా మారుతోంది. పేరు, తండ్రి పేరు, గ్రూపు, మాధ్యమం, భాషా సబ్జెక్టులు వంటి కీలక అంశాల్లో తేడాలు రావడం వల్ల పరీక్ష సమయాన విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటారు.
గతంలో పరీక్ష కేంద్రాల్లోనే విద్యార్థులు ఓఎంఆర్ పత్రాల్లో తప్పులు సవరించుకునే అవకాశం ఉండేది. చాలా సందర్భాల్లో తెలుగు స్థానంలో హిందీ ముద్రించబడడం, గ్రూప్ మారడం, తల్లిదండ్రుల పేర్లు తప్పుగా రావడం వంటి సమస్యల్ని అప్పటికప్పుడు సరిచేసుకునే అవకాశం ఉండేది. అయితే ఈసారి పరీక్ష కేంద్రాల్లో అలాంటి అవకాశం ఉండదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
దీనికి బదులుగా, ఈ విద్యా సంవత్సరం నుంచి పరీక్షలకు ముందుగానే వివరాల సవరణకు అవకాశం కల్పించనుంది. ఇందుకోసం డీఐఈవోలకు మరియు కాలేజీ ప్రిన్సిపాళ్లకు బోర్డు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్థికి కాలేజీ ప్రిన్సిపాళ్లు నామినల్ రోల్స్‌ను చూపించి, అందులో ఉన్న అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా కాలేజీలకు పిలిపించి వివరాలను క్రాస్ చెక్ చేయించి సంతకాలు తీసుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియ ద్వారా ఓఎంఆర్ పత్రాల్లో వచ్చే పొరపాట్లను ముందుగానే పూర్తిగా నివారించవచ్చని బోర్డు భావిస్తోంది.
IBomma Ravi : మరో మూడురోజుల పోలీస్ కస్టడీకి ఐబొమ్మ రవి
అంతేకాక, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఇంటర్ కాలేజీల్లో చదువుతున్న దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులకు పరీక్షల ఫీజులు, గడువులు, నామినల్ రోల్స్ పరిశీలన, ప్రాక్టికల్స్ షెడ్యూల్ వంటి సమాచారాన్ని ఎస్‌ఎంఎస్‌ల రూపంలో పంపించాలనే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పరీక్షల ఫీజు చెల్లించిన విద్యార్థులకు నవంబర్ 30 వరకు తమ నామినల్ రోల్స్‌లో ఉన్న పొరపాట్లను సవరించుకునే అవకాశం కల్పించింది. ఫీజు గడువు ముగిసిన తరువాత కూడా మరోసారి సవరణ అవకాశం ఇవ్వనున్నట్లు బోర్డు తెలిపింది.
ప్రస్తుతం 92% మంది విద్యార్థులు ఇప్పటికే పరీక్ష ఫీజులు చెల్లించడంతో, వివరాల ధృవీకరణ ప్రక్రియ త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ విధంగా, ఇంటర్ బోర్డు విద్యార్థుల వివరాలను ఖచ్చితంగా సరిచేసుకునే అవకాశం అందించి, పరీక్షల సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను ముందుగానే నివారించడానికి చర్యలు చేపట్టింది.
Rabri Devi Bungalow: బరాబర్ బంగ్లా ఖాళీ చేయం.. అల్టిమేటం జారీ చేసిన ఆర్జేడీ!