బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక నేడు రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నేడు తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, నిర్మల్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాదు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
బుధవారం రాత్రి హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా రోడ్లన్ని జలమయం అయ్యాయి. భారీగా వర్షపు నీరు రోడ్లపై చేరడంతో.. రోడ్లన్ని చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలన్ని పూర్తిగా జలమయం అవ్వడంతో స్థానికులు చాలా ఇబ్బందులు పడ్డారు.ఆల్ టైం రికార్డ్ గా అత్యధికంగా ముషీరాబాద్ లో 18.3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. బోలక్ పూర్ లో 15.8 సెంటీ మీటర్ల వర్షపాతం..సికింద్రాబాద్ 14, శేర్లింగంపల్లి లో 13.9 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
నేడు కూడా హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో నేడు అక్కడక్కడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.